Asianet News TeluguAsianet News Telugu

ఈ. వెంకటేష్ కవిత : గుడిసె జ్ఞానం

జీవితమంటే కేవలం బ్రతకడం కాదు తన చుట్టూ ఆవరించిన అజ్ఞానపు తిమిరాన్ని పుస్తక కాంతితో యుద్ధం చేయడం అంటూ ఈ. వెంకటేష్ రాసిన కవిత  ' గుడిసె జ్ఞానం ' ఇక్కడ చదవండి : 

E Venkatesh poem - bsb - opk
Author
First Published Oct 10, 2023, 12:35 PM IST | Last Updated Oct 10, 2023, 12:35 PM IST

ఊరికి దూరంగా
విసిరివేయబడ్డ
ఏకాంత నిశ్శబ్ద స్మశానం
నా ఇల్లు

అయినా నా ఇల్లు 
తాజ్ మహల్ కంటే
అందంగా కనిపిస్తుంది
బహుశా ప్రపంచంలో తొమ్మిదవ
వింత కావచ్చు

ఇల్లంటే నాలుగు గోడలు
విలువైన ఫర్నిచర్ కాదు
ఇల్లంటే ఒక భరోసా... ఒక స్నేహ హస్తం
ఇల్లు అంటే ఆత్మీయ అనురాగాల 
అపురూప మిశ్రమం

ఇల్లు గుడిసె కావచ్చు గాక
కానీ అంబేద్కర్ చూపిన
వెలుగులో నిరంతరం
మిరుమిట్లు గొలుపుతుంది
ఇంట్లో ఎక్కడ చూసినా 
పుస్తకాల జ్ఞానపు విత్తనాలు
ఇందులో కొన్ని పాత విత్తనాలు
కొన్ని సరికొత్త వంగడాలు

మరి ఈ విత్తనాలను
అజ్ఞానపు హృదయాలలో
నాటాలని
జ్ఞానపు వటవృక్షాలను
తయారు చేయాలని
నిరంతరం శ్రమిస్తుంటాను

కొందరు శ్రద్ధగా వింటారు
మరికొందరు విన్నట్లు నటిస్తారు
మేధావులు మెల్లిగా మగతలోకి జారుకుంటారు
మాది వృధా ప్రయాస అని నా మిత్రులు
మొహం మీదే మొహమాటం లేకుండా అనేస్తారు

జీవితమంటే కేవలం
బ్రతకడం కాదు
తన చుట్టూ ఆవరించిన
అజ్ఞానపు తిమిరాన్ని
పుస్తక కాంతితో యుద్ధం చేయడం

నాది గుడిసె కావచ్చు
కానీ అది పంచే జ్ఞానం
దేశంలో గల ఏ దేవాలయాల్లో కూడా లభించదు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios