డా. ఉదారి నారాయణ కవిత : మాటను బతికించుకోవాలి
ఉద్వేగాల నీరు పోసి, ప్రశ్నల ఎరువేసి మాటను బతికించుకోవాలి అంటూ ఆదిలాబాద్ నుండి డా. ఉదారి నారాయణ రాసిన కవితను ఇక్కడ చదవండి
మనుషులు కలుసుకున్న చోట
మొగ్గల్లాంటి భావాలు
నవ్వుల షామియానా పరుస్తాయి
మాటలు పెగలక పోవడం
గొంతు కుహురంలోంచి దాటక పోవడం
ఊటలాగిన కాలువల్లాగా
రెక్కలాడని పిట్టలాగా కొట్టుకోవడం
మహా ఘోరం
మైనపు ముద్దలా అంటుకొని మూల్గడం
మరీ దారుణం.
అక్షరాలు మాటలయి పొదిగినప్పుడే
మనిషి ఆలోచనలు
పించంలా విచ్చుకుంటాయి
మాటలు మెదడు నేలలో మొలకెత్తిన్నుంచే
గొంతులో అక్షరాల మినుగురులు
అగ్నికణాలై విస్తరిస్తాయి.
మనిషి సమూహశిఖరం కావడం
శిఖరాల రాసుల్ని పొంగించడం
చరిత్ర అడుగులో దాగిన సజీవ శాసనం
భావాలని భాస్వరములా మండించడానికి
ఒక్క మాటచాలు
మంటల కండల్ని
సలాక కొంకి ఎగ దోస్తున్నట్లు
నిప్పుకళ్ళ మనుషుల్ని కలపడానికి
తుఫానులాంటి ఒక్క మాట చాలు
మహాసభలు ఉప్పొంగ డానికి…
ఉద్వేగాల నీరు పోసి, ప్రశ్నల ఎరువేసి
మాటను బతికించుకోవాలి
మాటలకు పుటం పెట్టి రజోతేజం అద్దే
మనిషిని బతికించు కోవాలి
మనిషిని బతికించు కోవాలి.