రాజ్యం సామాన్యుడి వశమై మరో చరిత్ర ఆరంభమవుతుంది అంటూ  డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత '  అంగ‌డి... ' ఇక్కడ చదవండి :

చెమటోడ్చి కష్టంతో
శ్రమకోర్చి యంత్రంతో
రూపొందిన వస్తువులన్నీ
ఒకచోట చేరి కనిపించే
వినిమయ దృశ్య సంచయం
పట్నంలో పెద్ద అంగడి
అన్ని కొనేయాలనిపించినా
ఆర్ధికం సహకరించాలి కదా..!
వస్తువులేమో బోలెడు
కోర్కెలేమో బారెడు
స్థోమతేమో చారెడు
ఏదైనా కొనే స్థాయి
ఎప్పుడొస్తుందో ఈ చేతికి
కొనుగోలు ప్రపంచంలో
నా పేరుకొక అవకాశం ఎప్పటికో...!
ధరల ధరణిలో 
వినియోగదారుడిగా నాకు
సముచిత స్థానం ఎప్పుడో..!
గుండె మూలలో ఎప్పుడూ
ఒక ధీమా పోరాడుతూనే ఉంటుంది
మార్పు జరిగి తీరుతుంది
ధరాజ్యం సామాన్యుడి 
వశమై మరో చరిత్ర ఆరంభమవుతుంది