డా.తిరునగరి శ్రీనివాస్ కవిత : భూలోకపు భూతం...
స్వచ్ఛ నవ్య సమాజం అవతరించాలి పారదర్శకత నిండుగా వెల్లివిరియాలి అంటూ డా.తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' భూలోకపు భూతం...' ఇక్కడ చదవండి :
మాయ రోగమది
మానని గాయమది
అత్యాశ కడుపున పుట్టి
ఆపన్నుల అవసరాలనే
బలహీనతల అస్త్రంగా మార్చి
జీవితాలను ఏమార్చే
జడజ్జంత్రే అవినీతి
సర్వత్రా వేళ్లూని
వికృతంగా జడలు విప్పి
తరతమ బేధమే లేకుండా
సమస్త వ్యవస్థలను తొక్కేసింది
జీవనాదర్శాలను మ్రింగేసి
విలువల వలువలను ఒలిచేసి
నిజాయితీని జీవచ్ఛవం చేసి
ఇంతై అంతై అంతంతై అల్లంతై
ఎంతెంతో విస్తరించిన భూలోకపు రాకాసి
కసే తప్ప ఆ భూతానికి కనికరమే లేదు
కాటేయడమే తప్ప మానవీయత కానరాదు
జలగలా మారి రక్తాన్ని పీల్చడమే
ఆ రాకాసికి తెలిసిన ఏకైక విద్య
ఇక ఏకమై మానవాళి పోరాడకపోతే
ధైర్యంతో ఇప్పుడు ప్రతిఘటించకపోతే
కలిసికట్టుగా యుద్ధమే ప్రకటించకపోతే
తృప్తిగా బ్రతకడమెలా ?
పారదర్శకంగా సాగడమెలా ?
భూమ్యాకాశాన్ని కూడా తెరలా కమ్మేసిన
ఈ చీకటి భూతాన్ని ఎదిరించాలి
ఈ రాకాసి పీడను పొలిమేరలు దాటించాలి
స్వచ్ఛ నవ్య సమాజం అవతరించాలి
పారదర్శకత నిండుగా వెల్లివిరియాలి
నీతి వైపు నడిచే
వికాస దిశలెన్నో వేనవేలై పుట్టి
జీవన దిక్కుల్ని వెలిగించాలి