డా. తిరునగరి శ్రీనివాస్ కవిత : సోల్జర్‌కు సాల్యూట్...
మరణం దేహానికే కాని ఉజ్వలమై వెలిగే పాటకెక్కడిది? అంటూ డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' సోల్జర్‌కు సాల్యూట్...' ఇక్కడ చదవండి :
మార్పును కోరిన కవి
ఉద్యమాల ఉదయమైన రవి
పాటనే ఆయుధంగా ఎక్కుపెట్టిన
పోరాటాల పొద్దు పొడుపు
గర్జించిన ప్రజా గొంతుక
ఆకాశమంతెత్తుకు
పాటల జెండాను ఎగరేసిన సూర్యుడు
సమాజ సమూహంలో
ధైర్యపు నడకలను పరచిన సైనికుడు
జనమే ఆ గళానికి భూమిక
అంతెరగని అనంతమే
అలుపెరుగని కదలికే
ఆ పాటకు మహా మాతృక
పీడనపై ఎదిరింపే
ఆ ప్రచండ భావాలకు వాహిక
మరణం దేహానికే కాని
ఉజ్వలమై వెలిగే పాటకెక్కడిది?
కదం తొక్కిన ఆ కాలిగజ్జెలకి
ఎదురెరగని భుజపు నల్లగొంగడికి
అసమానమైన ఆ రాగాలాపనికి
ఆ ఆటకు
ఆ పాటకు
ఆ గానవీచికకు
ప్రపంచాన్నిపాటై పలకరించిన
ఆ అపూర్వ గళ సీమకు
ఆ జన వాగ్గేయకారునికి వందనం
ప్రజాయుద్ధనౌకకు సాల్యూట్...