డా. తిరునగరి శ్రీనివాస్ కవిత : ఆలోచిస్తూ...
జ్ఞాన సంచయ స్మృతుల్ని పొందాలంటే కాంక్షా సమూహాలను దాటాలి అంటూ డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' ఆలోచిస్తూ... ' ఇక్కడ చదవండి :
పరుగెత్తే కాలమే
పరచుకున్న అనుభవ సంకేతం
మునివేళ్ళతో దోసిళ్ళు పట్టు
అలుపుల, మలుపుల మైలురాళ్ళుంటాయి
తలపైకెత్తి చూస్తే
కప్పిన అనంత ఆకాశంలో
నిన్నటి నిశ్శబ్దపు నీడల జాడలుంటాయి
పక్కన పడేయలేని వెన్నో కన్పిస్తాయి
అప్పుడు శూన్య దృక్కులను
రెక్కల చప్పుడుతో జయించాలనిపిస్తుంది
కదిలే చూపులతో
కన్నీళ్ల నమస్కారాలను అందుకోవాలనిపిస్తుంది
బుద్ధి ప్రవాహంలో ఇంకిపోవాలనిపిస్తుంది
నివ్వెరపడినా
ప్రశ్నార్ధకంగా మిగిలినా
ఆత్మన్యూనతల ఆలింగనాలను విడిపించుకోవాలి
జ్ఞాన సంచయ స్మృతుల్ని పొందాలంటే
జ్వలనం కావాలి
మధనం పెరగాలి
కాంక్షా సమూహాలను దాటాలి
కోర్కెల ఉరితాళ్ళను తప్పించుకోవాలి
గుండెగుహ తెరచుకోవాలి
గవ్వలలో బతుకు సంగీతం వినిపించాలి
గువ్వలలో అనంతాకాశ విస్తరణ కనిపించాలి
ఆకుపచ్చని తనాన్ని ఆవహించుకుని
పత్రహరితమై కొత్త అడుగేయాలి