ఇప్పుడక్కడ ఉంది నడకలేని నది కనురెప్పలు తెరిచిన ఇసుక వాకిలి అంటూ డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత ' నడకలేని నది ' ఇక్కడ చదవండి :  

తడి కానరాలేదు
చెమ్మదనం పిలిచిన రాని చుట్టం
చెలిమితో నా చేతులు చేరి
పిడికిలిగా మారింది
సన్నసన్నగా జారింది
వేళ్ల సందుల్లోంచి చిన్నచిన్నగా
చూద్దును గదా అది నదీ గర్భం

ప్రపంచం కోల్పోతూనే ఉన్నది 
పర్యావరణ సమతౌల్యం
ఆకులు లేని ప్రకృతిలో 
ఆరోగ్యం అంతరిస్తున్న మట్టి
బలం లేని నడకల తడబడుతుంది 
సరిచూసుకో ముందే
అందాలూ తేనె గంధాలన్నీ కాటుగలుస్తాయ్ నడకలేని నదిలా

అలల ఆటలేని నదిని 
నేను తడిమి మరీమరి చూస్తే
మెదడు పొరల్లోకి అప్ లోడైంది
తడిలేక పొడిబారిన పొత్తిళ్ళలో 
నది ఎండిపోయిందన్న వార్త
ఇప్పుడక్కడ ఉంది నడకలేని నది
కనురెప్పలు తెరిచిన ఇసుక వాకిలి