డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : ఊపిరి వీచికలు
కనురెక్కలు విప్పిన కవిత్వంలో జీవితం పూదోట అంటూ డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత 'ఊపిరి వీచికలు' ఇక్కడ చదవండి :
ఈ జీవితం ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చింది మనిషికి
ఆకుపచ్చని చెట్టులా బతుకుతూ
నిస్వార్ధ సేవలను పంచేందుకు
మనసున ఎంత గాఢంగా ఆలోచిస్తామో
బతుకును అంతే లోతుల్లోనూ ప్రేమిస్తాం
అనుభవించిన గాయాల తీపి భాధలే బతుకు దీపాలుగా
జీవితం మసక మసక గానో మరి ముసి ముసిగానో
సృజన లోకం కలం నిండిన సిరా
కొత్తగానే నడుస్తుంది
అడుగులు బలంగానే ఉన్నాయి
మరో సృష్టి జ్వాలావర్షం ఎగుస్తూ కురుస్తుంది
అక్షరాల సాధన ఈది తేలుతుంది
పలుకు బడుల సవ్వడి
నడిచే బడి పలుకుల తొవ్వల
ఎవరు రాసినా అవే అక్షరాలు
కానీ,రాత రాతలో తెలియని పొరలు కనిపించె
సన్నగానో సున్నితంగానో ఉంది
ఏది పాడినా మట్టి, గాలి, నీరు పాటే
అయినా, నడక నడకలో మరువని స్వర ఝరం నినదించె
కొత్తనో, పాతనో మనసుల తొలిచి నిలిచింది
భావావేశాల ఆయువులో
తెలిసినట్టున్నా తెలువదు మరి
కలిసినట్లున్నా కలువదు
దారులు వేరైనా ముద్దాడే గమ్యం ఒక్కటే
అదే ప్రవాహ జీవితంలో దాహం తీరని కవిత్వం ఆట
కనురెక్కలు విప్పిన కవిత్వంలో జీవితం పూదోట
రక్త కణాలు మోసుకొచ్చే ప్రాణాధార పోషకాల సహస్ర శక్తులు
ప్రవాహ రుధిర వీణ మీటిన సరిగమలు అవి
జీవన సంజీవిని పిలుపుల ధ్యానమే
కాంతి వెలుగుల మేలుకొల్పు చైతన్యం నేలా నింగి కన్నుల్లో