డా. సరోజ వింజామర కవిత : తోడు

రాగాలకు శిలలే కరుగుతాయట - అనురాగమై చూడ తోడుకు అర్థం తెలుస్తుంది అంటూ డా. సరోజ వింజామర రాసిన కవిత "  తోడు " ఇక్కడ చదవండి : 

Dr. Saroja Vinjamara's Poem : thodu - bsb

నాలో అగ్నికణం నీలో జ్వలించినపుడు 
నాలో తాపానికి నీకు దాహమేసినపుడు 
నాలో అంకురానికి నీవు చిగురు తొడిగినపుడు 
నాలో నువ్వు చూడాలనుకుంటున్న సంతోషం 
అదే అగుపిస్తుంది 

మీటినపుడు కదా వీణలో రాగం తెలిసేది 
నువ్వుకూడా నాతో మమేకమయి చూడు 
నా మధనానికి మందేమిటో తెలుస్తుంది 
నాలో చీకటికి దీపమయి చూడు 
నా బాటలో నడకవయి చూడు
కంటకాల బాధ ఏమిటో తెలుస్తుంది

విడిపోలేనంత దగ్గరయి చూడు 
పువ్వుకు తావి బంధం ఏమిటో తెలుస్తుంది 
నేను నీవయ్యానని గుర్తించినప్పుడు 
అసలు నాలో ప్రేమను ఆస్వాదించి చూడు 
చకోరం ఎందుకు ఆహుతవుతుందో తెలుస్తుంది 

కంటకాలకు కారిన రక్తానికి 
కట్టు కట్టడానికి బదులు 
వాటిని కట్టడి చేసే బదులు 
దూరం నిలబడి నవ్వుతావేం 
సంబంధం లేదన్నట్టుగా చూస్తావేం
పరాయివానిలా పారిపోతావేం
చావమని వదిలేస్తావేం 

రాగాలకు శిలలే కరుగుతాయట 
అనురాగమై చూడు 
తోడుకు అర్థం తెలుస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios