పీటర్ హ్యాండ్కే కవిత: బాల్యపు గీతం
పీటర్ హ్యాండ్కే కవితను డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు తెలుగులోకి అనువాదం చేశారు. బాల్యపు గీతం అనే ఈ కవితను చదవండి.
ఆ బాలుడి బాల్యంలో
చేతులు ఊపుతూ నడిచే
అతనిలో ఎన్నో ఆకాంక్షలు...
సెలయేరు ఒక నదిగా కావాలని,
నది ఒక జలపాతంగా మారాలని
ఈ బురదనీటి గుంట సముద్రంగా రూపు దాల్చాలని
ఆ బాలుడు బాల్యంలో
తనను తాను
చిన్నపిల్లవాడిగా భావించలేదు
ప్రతీదీ భావపరిపూర్ణత కలిగిందని,
అన్ని ప్రాణులు ఒకటేనని
భావించేవాడు
ఆ బాలుడి బాల్యంలో
దేని గురించీ
ఏ అభిప్రాయమూ లేదు,
ఏ అలవాట్లూ లేవు,
కాలుపై కాలు వేసుకుని
ధీమాగా కూర్చునేవాడు
ఉన్నట్టుండి పరుగు పెట్టేవాడు
నుదుటిపైకి తలవెంట్రుకలు జారిపోయేవి
ఫోటోల కోసం కృత్రిమంగా
పోజులిచ్చేవాడు కాదు
ఆ బాలుడి బాల్యంలో
ఎన్నో ప్రశ్నలు ముప్పిరిగొనేవి
నేను నేనుగా ఎందుకున్నాను?
నేను నువ్వెందుకు కాదు?
ఇక్కడెందుకు ఉన్నాను?
అక్కడెందుకు లేను?
కాలం ఎప్పుడు మొదలైంది?
అంతరిక్షపు కొస ఎక్కడుంది?
సూర్యుని కింద జీవితం
కేవలం కల మాత్రమే కాదా?
నేను చూసేది, వినేది, ఆఘ్రాణించేది
నిజమైన ప్రపంచం ముందుండే
భ్రాంతియుత ప్రపంచం
కాదుగదా?
దయ్యానికి, మనుషులకు తేడా చెప్తే
దయ్యం నిజంగా ఉంటుందా? అని ప్రశ్నించేవాడు
ఇంకా ఎన్నో సందేహాలు
నాలాగా ఉన్న నేను
ఇక్కడికి రాకముందు
ఉనికిలో లేకుండా ఎలా ఉన్నాను?
ఏదో ఒకరోజు
ఎలా ఉండకుండా పోతాను?
ఆ బాలుడు బాల్యంలో
అన్నీ నోట్లో కుక్కుకునేవాడు-
దుంప బచ్చలికూర, బఠానీలు, పిండివంటలు,
ఉడికించిన కాలీఫ్లవర్
ఇప్పుడు కూడా అవన్నీ తింటాడు-
కానీ తినాలి కాబట్టి తినడం ఉండదు
ఆ బాలుడు బాల్యంలో
ఒక కొత్త పరుపులో ఒకసారి మేల్కొన్నాడు
ఇప్పుడూ అంతే-
మళ్ళీ, మళ్ళీ.
అప్పట్లో చాలా మంది, అందంగా కనిపించేవారు,
ఇప్పుడు కూడా చాలా తక్కువమంది
అలాగే కనబడతారు- అదృష్టం కొద్దీ
ఆ బాలుడు బాల్యంలో
స్వర్గపు స్పష్టమైన చిత్రాన్ని
మనోఫలకంపై చిత్రించేవాడు
ఇప్పుడూ అంచనా వేస్తాడు-
కానీ శూన్యాన్ని ఊహించలేడు.
పైగా ఆ ఆలోచనే వణుకు పుట్టిస్తుంది
ఆ బాలుడు బాల్యంలో
ఉత్సాహంగా ఆడేవాడు
ఇప్పుడూ అదే ఉత్సాహం-
కానీ తన పని సంబంధిత విషయాల్లోనే
ఆ బాలుడి బాల్యంలో
యాపిలూ బ్రెడ్డుముక్కా సరిపోయేవి
ఇప్పుడు కూడా అంతే!
ఆ బాలుడి బాల్యంలో
చేతిని బెర్రీ పండ్లు నింపేసేవి
ఇప్పుడు కూడా అంతే!
తాజా వాల్ నట్స్ నాలుకను పచ్చిగా చేసేవి
ఇప్పుడు కూడా అంతే!
ప్రతి పర్వత శిఖరంపై
ఇంకా ఎత్తైన పర్వతం కోసం అన్వేషించేవాడు
ప్రతి నగరంలో
ఇంకా గొప్ప నగరం కోసం వెతుకులాడేవాడు
చిటారు కొమ్మలపై చెర్రీ పండ్లను చేరుకునేవాడు
ఇప్పటికీ అదే ఉత్సాహం
అపరిచితుల ముందు సిగ్గు
.. అప్పుడూ ఇప్పుడూ అంతే!
తొలి మంచుబిందువు కోసం
వేచిచూసేవాడు
ఇప్పటికీ అవే ఎదురుచూపులు
ఆ బాలుడి బాల్యంలో
ఒక చెట్టు పైకి
ఈటెలాంటి కర్రను విసిరాడు
అదింకా కంపనాలు సృష్టిస్తోంది.
- పీటర్ హ్యాండ్కే
అనువాదం: డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు