Asianet News TeluguAsianet News Telugu

డా.పాండాల మహేశ్వర్ కవిత : కాలం గుర్తు చేస్తుంది

కండువాలు మార్చె కల్చర్ మా సొంతం - చేతులెత్తి జేజేలు కొట్టడం మీ నైజం అంటూ గోసుకొండ పోచంపల్లి నుండి డా.పాండాల మహేశ్వర్ రాసిన కవిత 'కాలం గుర్తు చేస్తుంది' ఇక్కడ చదవండి :

Dr. Pandala Maheshwar Poem - bsb - opk
Author
First Published Dec 11, 2023, 12:23 PM IST

చేతగానిచర్య చెడగొట్టును సంఘాన్ని
చదువులెందుకు?ఉద్యోగులెందుకు?
నిరుద్యోగుల నిరసనలెందుకు?
అవకాశ వాదం అణగదొక్కే నైజం

ఓట్లెందుకేయరో ? వాళ్ళెట్లతిరుగుతరో ?
మాకంట్ల పెట్టుకున్నం..సంగతి జూస్తం.!
మమ్మల్ని ప్రశ్నించే దమ్మెవరికుంది?
మేం మోనార్కులం మమ్మల్ని 
యెవరు మోసం జేయలేరు!

మీ గుసగుసలు
గునుగుడు మాకెందుకు?
మాదే గుత్తాధిపత్యం !
గోడకు చెవులు కాదు 
కళ్ళను మొలిపించిందీ మేమే 
మీ డాటా అంతా ఒక్క క్లిక్ తో చదివేస్తం...
ఒక్కఫోన్ తో చిదిమేస్తం..!
నా పార్టీవ్రత్యం నేను చెప్పిందే జేయాలే
బాంచన్ దొరా అని బతకాలే!
తొక్కుకుంటు తొండిగా ముందుకెళతాం  
ముంచుడో తెంచుడో జాన్తా నహీ ..!

కుక్కకు బిస్కటేస్తమంతే 
వంగిదండంబెట్టె భంగిమొక్కటే మీవంతు ..
ఎగిసిపడొద్దు ఎంతరా మీ బతుకు?
పిపీలికాలు నలిపేస్తం!
ఎదురులేని నరరూప రాజకీయ తంత్ర గాళ్ళం!
కల్లబొల్లి కబుర్లు చాలు మీ ముఖాలకి లొట్టలేస్తు..
గట్టిగాఉబ్బి వట్టిగ చప్పట్లు కొడతరు
మందు బిర్యానికే  బానిసలైతరు ..!

నీళ్ళు, నిధులు నియమకాల నియమాలన్నీ (నా)మా చేతుల్లోనే!
చెప్పిందే మేం...చేసేది కూడా మేమే 
ఎప్పుడో? ఒకప్పుడు..మాకిష్టమైతేనె..!
కుక్కిన పేళ్ళలా పడుండాలి అంతే..!

అధికార దర్పమంతా 
మా ముఖాల్లో మా మోచేతుల్లో
చెప్పింది చేయం చేసేది చెప్పం
అవకాశాల కోసమే మా ఆర్భాటమంతా
కండువాలు మార్చె కల్చర్ మా సొంతం
చేతులెత్తి జేజేలు కొట్టడం మీ నైజం
మీరంతా చేతగానీ సన్నాసులు కదా..!
అవకాశమెందుకు? 
అధికార మెందుకు?
రాజ్యాధికార హక్కులు బాధ్యతలు మావే... 
వదులుకునేంత  పిచ్చోళ్ళమా మేం..!
జై యంటే జైజై అనాలి అంతే..
నోట్లతో ఓట్లను మాసొంతం చేసుకునే 
కుటిలవాజితనమే మా నైజం... 

అనుకోలేదని ఆగవుకొన్ని... 
జరిగేవన్నీ మంచికనీ...
సబ్బండ వర్గాల వ్యతిరేక జడివానకు
బంధుల మాటున దాగిన 
రాబంధుల ప్రజారాజ్యం అస్తవ్యస్తమై..
ఆవేదనలో ...!
ప్రజలు దేవుళ్ళనే నానుడిని.
గుర్తుచేసింది కాలం ..అంతేగా మరి...!

కవులు, రచయితలకు ఏసియా నెట్ సాహితీ వేదిక స్వాగతం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios