సకల వైభోగాలతో సంక్రాంతి మీ ఇంట చేరాలని శుభాకాంక్షలు అందజేస్తూ విశాఖపట్నం నుండి డా. కె.జి. వేణు రాసిన కవిత " సంక్రాంతి శోభ "  ఇక్కడ చదవండి : 

కష్టాలన్నీ కాలిపోతూ 
ఇంటిముందు భోగి మంటలు 
హరిదాసు కీర్తన....ఎక్కడో
నిద్రను తట్టి లేపిన చప్పుడు 
చూస్తే అరిచేతినిండా సూర్యుడు. 

చెరుకుగడ నిలబడుతోంది 
ఒంటినిండా తియ్యదనంతో 
పాలు మరుగుతున్నాయి
మీగడ కోసం సెగను భరిస్తూ
అన్నింటిలోనూ అమ్మే కనిపిస్తూ 

అమ్మాయికి పెళ్లి కుదిరింది 
ముగ్గుల్లో చుక్కలనిండా సిగ్గు
దూరంగా సన్నాయి మేళం
బంతి పూల రేకులనిండా
మన్మధబాణాలతో రేపటి రేడు 

ఇంటికి అల్లుడొచ్చాడు 
వసూళ్ల కోసం కాదు
అత్తరులాంటి సంస్కారంతో 
అందివ్వటంలో నేరుగా
శిబి చక్రవర్తిని గుర్తుచేస్తూ 

సంక్రాంతి వచ్చిందే తుమ్మెద 
నీ జాడ ఎక్కడే తుమ్మెద 
నా జడలోనే ఉన్నావా తుమ్మెద 
తుంటరి పనులు చేయకు తుమ్మెద
చూస్తున్నారు జనమంతా తుమ్మెద 

ఇంటి నిండా సంక్రాంతి శోభ
దీపం ఎవరు వెలిగించారో కానీ
పొంగే గోదావరి వరదలా
వెంకి కళ్ళల్లోని నవ్వులా
తరం, తరం ఇలా తరలివస్తూ...