డా.చీదెళ్ళ సీతాలక్ష్మి కవిత : సప్త ఐశ్వర్యుడు
నేడు రథసప్తమి సందర్భంగా డా.చీదెళ్ళ సీతాలక్ష్మి రాసిన కవిత " సప్త ఐశ్వర్యుడు " ఇక్కడ చదవండి :
సప్తమి తిథి సంకేతమై
సప్తాశ్వాసాల తేరుపై ఎక్కి
సప్తవర్ణ కాంతులు వెదజల్లుతూ
సప్త సముద్రాలు దాటుతూ
తూర్పు నుండి పశ్చిమానికి
పడమట నుండి తూర్పుకు
ఉత్తరదిక్కుకు పయనిస్తూ
గగన వీధిలో సంచరిస్తూ
లోకరక్షణ చేసే ఆదిత్యుడు
ఏమీ ఆశించని నిస్వార్థపరుడు!!
ఆరోగ్యం ఆహారం ఆనందం
ఆయుష్షు ఆహ్లాదం ఆహార్యం
అన్ని ప్రాణులకు ఇస్తూ
చైతన్యం కలిగించే చైతన్య దీప్తి!!
ఉత్సాహం ఉల్లాసం ఉద్రేకం
అన్ని అందించే భాస్కరుడు!!
ఆరోగ్య కారకం అర్కం
అర్కపత్ర స్నానం రోగనివారణం
ఆర్ఘ్యం ఇవ్వడం అలసిసొలసి పోతున్న సూర్యునికి సేదతీర్చడం!!
సుప్రభాత వేళ సూర్య నమస్కారాలు
ఆయుః ఆరోగ్యం
విటమిన్ డి అందించే
ఆరోగ్య ప్రదాత
ఆదిత్యుడు అందరికీ ఆరాధ్యుడు!!
శారీరక మానసిక వత్తిడులు తగ్గించి శాంతిని కలిగించే
సప్త ఐశ్వర్య దాత
సకల సంధాతా
సర్వజన వినుతా
సంజీవని ప్రదాత
సూర్యనారాయణ నమః..