Asianet News TeluguAsianet News Telugu

కాళోజీ అంటే ఒక ఉద్యమ కరచాలనం.. ఒక ధిక్కారస్వరం.. ఒక తిరుగుబాటు..

నేడు ( సెప్టెంబర్ 9 ) కాళోజీ జయంతి సందర్భంగా డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రాసిన 'తెలంగాణ యాదిలో "కాళోజీ" ' వ్యాసం ఇక్కడ చదవండి :

Dr. Bhimpalli Srikanth rightup on Kaloji in the occasion of Kaloji Jayanti - bsb - opk
Author
First Published Sep 9, 2023, 11:13 AM IST

కాళోజీ గురించి జ్ఞాపకం చేసుకోవడమంటే తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని మననం చేసుకోవడమే. కాళోజీని ఏ చట్రంలో బంధించలేము. ఆయన అన్ని వర్గాల, అందరి ప్రజల ఉద్యమ గొంతుక. కాళోజీ కవిగా, కథారచయితగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా, పౌరహక్కుల గొంతుగా కాళోజీ నిత్యస్మరణీయుడు.

కాళోజీ అంటే ఒక ఉద్యమ కరచాలనం. ఒక ధిక్కారస్వరం. ఒక తిరుగుబాటు. కాళోజీ జీవితమంతా తెలంగాణ పోరాటాలతో గడచిపోయింది. ఏ ఉద్యమం జరిగినా కాళోజీ అడుగు ముందుంటుంది. ఏ పోరాటం సలిపినా కాళోజీ కార్యశీలడవుతాడు.  ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అక్కడ కాళోజీ ప్రత్యక్షమవుతాడు. అన్యాయాల్ని చేసేవారిని చీల్చి చెండాడుతాడు. అది స్వభాష కావచ్చు. స్వరాష్ట్రం కావచ్చు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడుగడుగునా చీల్చి చెండాడిన కాళోజీ తన తనువంతా తెలంగాణ నింపుకున్నాడు. కాళోజి తెలంగాణా కోసం ఉద్యమం చేసినా, కవిత్వం రాసినా అందులో తెలంగాణ ఆత్మను ప్రతిఫలించేవాడు. తెలంగాణే నా గొడవ అనేవాడు. అందుకే నా గొడవ తెలంగాణ గొడవ అయింది. కాళోజీ ఆత్మయ్యింది. "నా గొడవ " లో ఏ పదం, ఏ వాక్యం, ఏ కవిత చదివినా ఒక సామాన్య మానవుడు అనుభవిస్తున్న సాధకబాధలు అనుభవంలోకి వస్తాయి. ఒక్కోవాక్యం మనల్ని ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది. కాళోజీ కోరచూపులతో కోస్తున్నట్టుంటుంది.

నిత్యచైతన్యశీలిగా, తెలంగాణా పోరాట యోధునిగా ధిక్కారస్వరాన్ని వినిపించిన కాళోజి నిత్యం జరుగుతున్న అన్యాయాల్ని, అసమానతల్ని ప్రశ్నించినవాడు. నిరంతరం సమాజంతో మర్షణ పడుతుండేవాడు. ఆ ఘర్షణే కాళోజిని ధిక్కారయోధుడిని చేసింది. తెలంగాణ జీవితాలలో నిరంతరం మమేకమైన కాళోజీ ఆ జీవితాల్ని తనవిగా చేసుకున్నాడు. తన బాధలుగా చెప్పుకున్నాడు. అందుకే కాళోజీ అందరివాడయ్యాడు. కాళోజీ జీవితమంతా తెలంగాణాకే అర్పించుకున్నాడు.

1914 సెప్టెంబర్ 9న జన్మించిన కాళోజీ తెలంగాణ ఉద్యమానికి వేగుచుక్కై భాసించాడు. చుక్కానియై నిలిచాడు. కణకణమండే నిప్పుకణికగా రాటుదేలాడు. తెలంగాణ ఉద్యమాన్ని తన చేతితో పట్టుకుని నడిపించాడు. అప్పుడా ఉద్యమం అందరి చేతుల్లో బలంగా నాటుకుంది. ఆయన అడుగుజాడలే ప్రతి ఒక్కరికి చుక్కాని అయ్యింది. కాళోజీ ఏది చేసినా ప్రజల గుండెల్లో నాటుకునేటట్లు చేశాడు. తెలంగాణ యాస గురించి చెప్పినా, తెలుగు భాష గురించి చెప్పినా, తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పినా నేటికవి నిరంతర కవితాప్రవాహాలు. కాళోజీ పారుతున్న నది. అది నిత్యనూతనంగా ఉంటుంది. అతని కవిత్వం నాటికి, నేటికి, ఏనాటికైనా నిత్యచిరంజీవిలా ఉంటుంది. అదే కాళోజీ కవిత్వానికున్న గొప్పదనం. కాళోజీ మనిషిగా జీవించలేదు. ఉద్యమంగా బ్రతికాడు. కవిత్వమై పోరాడాడు. మాటై గుచ్చాడు. తూటై పేలాడు. నిజాయితియై నిలువెత్తుగా నిలిచాడు. అన్యాయానికి తిరుగుబాటయ్యాడు. యావత్ తెలంగాణకు నిరంతర స్వాప్నికుడయ్యాడు. అందుకే కాళోజీని తెలంగాణ సమాజం నిత్యం గుర్తించుకుంటుంది.

కాళోజీ కవిత్వం రాసినా, ప్రజా ఉద్యమాలు చేసినా తెలంగాణ గురించి గర్జించినా, మానవ హక్కుల కోసం పరిశ్రమించినా అది కాళోజీ కోసం కాదు. యావత్ పీడిత, బాధిత దగాపడ్డ ప్రజల కోసం.

తెలంగాణా సాంస్కృతిక పునర్జీవన ఉద్యమంలో కాళోజీది ప్రముఖ పాత్ర. సాంఘిక, రాజకీయ ఉద్యమాలపై ఎప్పటికప్పుడు స్పందించి పోరాటం చేయడం కాళోజీకే అబ్బింది. పోరాటమే జీవితంగా బతికినవాడు. ఉద్యమమే శ్వాసగా జీవించినవాడు. నిస్సత్తువుగా ఉన్న తెలంగాణకు జీవం పోసినవాడు. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ భాషను బ్రతికించినవాడు. కాళోజీ జీవితమే సాహిత్యమై, సాహిత్యమే జీవితమై బతికినవాడు. కాళోజీ ఉద్యమ జీవితంలో ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్ళాడు. పోరాట జీవిగా బతికాడు.

కాళోజీ పోరాటాల్లో ఎంత ఘటికుడో అతని కవిత్వంలో అంత గాఢత ప్రతిఫలిస్తుంది. ప్రజాస్వామ్యంలోని అసమానతల్ని, అన్యాయాల్ని, కుత్సితాల్ని తన కవిత్వంలో కాళోజీ ఎత్తిచూపాడు. జీవితాంతం ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడాడు. కవితా కరవాలాలను ఝలిపించాడు. కాళోజీ కవితాపంక్తులు, సూక్తులుగా, సామెతలుగా, జాతీయాలుగా ఉంటాయి. పదికాలాల పాటు భద్రపరచుకునేటట్లు మనల్ని మేల్కొలుపుతుంటాయి.

" అవనిపై జరిగేటి అవకతవకలను చూసి
ఎందుకో నా హృదిని ఇన్ని వేదనలు
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె మాయమోసము జూచి మండిపోవును ఒళ్ళు"

కాళోజీ ఏది రాసినా వాస్తవాల్ని మన ముందుంచుతాడు. సరళంగా చెప్పినా ఘాటుగా హెచ్చరిస్తాడు. అది కాళోజీ కవితకున్న గట్టిదనం. కాళోజీ ఏ ఉద్యమంలో పనిచేసినా తన వంతు పాత్రను నిజాయితీగా పోషించాడు. అది ఆంధ్ర మహాసభ ఉద్యమమైనా, ఆర్యసమాజ్ అయినా, భారత స్వాతంత్రోద్యమమైనా, నిజాం వ్యతిరేక పోరాటమైనా, హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటమైనా మానవ హక్కుల ఉద్యమమైనా కాళోజీ నిర్భయంగా, నిజాయితీగా పనిచేసాడు. ప్రజా ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. గాంధేయవాదిగా జీవించాడు. గాంధీ తత్వాన్ని అలవరచుకున్నాడు. ప్రజాస్వామ్యవాదిగా ప్రజల గొంతుకను వినిపించాడు.

కాళోజీ ఏ కవిత్వం రాసినా అందులో ఒక వేమన దర్శనమిస్తాడు. ఒక ఖలీల్ జిబ్రాన్ కనిపిస్తాడు. ఒక రస్సెల్ తొంగిచూస్తాడు. ఒక తాత్వికుడిని బయటికి తెస్తాడు. కాళోజీ ఒక వ్యక్తి మాత్రమే కాదు. బహుముఖాల, బహుప్రజ్ఞల బాటసారి. తన కవిత్వంలో అడుగుఅడుగున తెలంగాణ పదాల్ని ఉపయోగించాడు. తెలంగాణ పదాలకు జీవం పోసినవాడు. తెలంగాణ సంస్కృతిని తన రచనల్లో ఆవిష్కరించినవాడు. మొత్తంగా తెలంగాణ ఆత్మ కాళోజీ. చేసేదొకటి, చెప్పేదొకటి ఉన్న కాలంలో కాళోజీ చేసేదే చెప్పేవాడు. చెప్పిందే చేసేవాడు. అదే జీవితాంతం పాటించాడు. నిఖార్సైన మనిషిగా నిలువెత్తుగా నిలిచినవాడు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే స్పందించేవాడు. సజీవ కవిత్వమై వినిపించేవాడు. అన్యాయాన్ని ఎదిరించి నిలిచినవాడు. ప్రజల జీవితాల్ని కవిత్వీకరించినవాడు. తెలంగాణ కోసం దివిటీయై వెలిగినవాడు. కాళోజీ అన్నట్లే...

" పుట్టుక నీది
చావు నీది
బ్రతుకంతా దేశానిది "
కాళోజీకిది అక్షరాలా సరిపోతుంది.
పుట్టుక నీది
చావు నీది
బ్రతుకంతా తెలంగాణది.

Follow Us:
Download App:
  • android
  • ios