డా. అమ్మంగి వేణుగోపాల్ కవిత : జయహో చంద్రయాన్ !
ఇది వెన్నెల సుగంధం అద్దుకున్న ఘట్టం ఇది సైన్స్ - కదనంలో గెలిచిన సుదినం అంటూ డా. అమ్మంగి వేణుగోపాల్ రాసిన కవిత ' జయహో చంద్రయాన్ !' ఇక్కడ చదవండి :
జయహో చంద్రయాన్ !
శుభహో చంద్రయాన్ !!
నీ అపురూప విజయానికి
నీ అసమాన ప్రస్థానానికి
దేశం గర్విస్తున్నది
ప్రపంచం విస్తుపోతున్నది
సముద్ర మథన సమయంలో
తొలిసారి అమృతం తాగిన చంద్రుడు
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో
మలిసారి ఆస్వాదించాడు అమృతాన్ని
ఇప్పుడు
అజస్ర సహస్ర బాహువులు చాపి
ఇస్రో తెస్తున్నది విజ్ఞాన సుధను
ఇతడిక పురాణ చంద్రుడు కాదు
నిత్య నవీన చంద్రుడు
కృష్ణ బిలాల చంద్రుడు కాదు
అమూల్య ఖనిజాల చంద్రుడు
కల్పిత కహానీల చంద్రుడు కాదు
ఉప్పొంగే జనసంద్రాల చంద్రుడు
కక్ష్యాంతరాలు దాటి లక్ష్యాన్ని ఛేదించిన
రష్యా మీద పైచేయి సాధించిన శాస్త్రజ్ఞున్ని
తన నిధి నిక్షేపాల మంత్రనగరికి
రారమ్మని ఆహ్వానిస్తున్నాడు చంద్రుడు
తలలు వంచుతున్నాయి గిరిశిఖరాలు
చేరువవుతున్నాయి దూరతీరాలు
ఇది వెన్నెల సుగంధం అద్దుకున్న ఘట్టం
ఇది సైన్స్ - కదనంలో గెలిచిన సుదినం
జో జీతా ఓ సికందర్
అబ్ కి బార్ విక్రమ్ ల్యాండర్
జయహో చంద్రయాన్ !
శుభహో చంద్రయాన్ !!