హైదరాబాద్: తన పదునైన కవితలతో సమాజాన్ని ఉతికి ఆరేసిన దిగంబర కవి భైరవయ్య ఎవరికీ చెప్పా పెట్టకుండా అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం తెలుగు సాహిత్య లోకానికి పట్టలేదు. కవి దేశరాజు తన వాల్ లో ఎక్కడో వచ్చిన చిన్న వార్తను పోస్టు చేసే వరకు కూడా ఆయన మరణవార్త ఎవరికీ తెలియలేదు. 

నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, మహాస్వప్నలతో కలిసి దిగంబర కవులుగా తెలుగు కవిత్వానికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చినవాళ్లలో భైరవయ్య ఒకరు. మొదటి నలుగురు విరసంలోకి వెళ్లగా, మహాస్వప్నతో పాటు భైరవయ్య వెలుపలే ఉండిపోయారు. ఈ సమయంలో భైరవయ్య రా అనే కవితా ,సంపుటిని వెలువరించారు. విషాదభైరవం అనే గ్రంథాన్ని కూడా వెలువరించారు. ఆయన 50కి పైగా కథలు రాశారు.

భైరవయ్య అసలుపేరు మన్మోహన్ సహాయ్. దిగంబర కవులు తమ అసలు పేర్లను మార్చుకుని వేరే పేర్లు పెట్టుకున్నారు. అందులో భాగంగా మన్మోహన్ సహాయ్ తన పేరును భైరవయ్యగా పెట్టుకున్నారు. భైరవయ్య 1942 డిసెంబర్ 8వ తేదీన నరసాపురంలో జన్మించారు. మొదట్లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేశారు. ఆ తర్వాత విశాఖపట్నంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించారు. విజయవాడ, హైదరాబాదుల్లో చదువుకున్నారు. హైదరాబాదు నుంచి వెలువడిన నవత త్రైమాసిక పత్రికకు కొంత కాలం ఎడిటర్ గా కూడా పనిచేశారు.

అప్పటికే ఆయనకు సాహిత్యంతో, సాహితీవేత్తలతో సంబంధాలు తెగిపోయాయి. కొంత కాలం తర్వాత విజయనగరం జిల్లా బొబ్బిలికి సమీపంలోని దత్తి రాజేరు వద్ద వింధ్యవాసి గ్రామంలో భైరవానంద స్వామిగా ఓ ఆచార్య పీఠాన్ని స్థాపించారు.  

ఈ నెల 19వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. 

దిగంబర కవిత్వంలోని ఈ ప్రసిద్ధమైన కవిత చదవండి

చెరచబడ్డ గీతాన్ని

నేను చెరచబడ్డ గీతాన్ని
నగ్నంగా నడివీధిలో కాటేసిన భూతాన్ని
స్వార్థపు కాంక్రీటు తొడలమధ్య
నలిపివేయబడ్డ రాగాన్ని
కీర్తి రతి తీరని బాబాకరుల
భయంకర
నఖక్షతాలకి, దంత క్షతాలకి
పుళ్ళుపడి కుళ్ళిపోయిన వక్షాన్ని
నేను గీతాన్ని !
కేరింతలు కొట్టి
పరులకైత తమదని భేరి మ్రోగించి
చలామణి చేయించే
చాపల్యుల చవకబారు కామోద్రేకానికి
చచ్చి పుచ్చిపోయిన పిండాన్ని
ముద్రాక్షతలతో తమ రాక్షసత్వాన్ని
లిఖించుకోవాలని
తాపత్రయపడే తుచ్ఛులు
స్వైరవిహారం చేసిన శరీరాన్ని
రసాన్ని వదిలి
రాక్షసత్వాన్ని ప్రతిబింబించిన రూపాన్ని
నేను గీతాన్ని
అసహ్యంగా - అసభ్యంగా
బహిరంగంగా - బాహాటంగా
సిగ్గులేక - చాకచక్యంలేక
నీచంగా - ఛండాలంగా
చెరచబడ్డ గీతాన్ని
చిత్రించబడ్డ భూతాన్ని!