దేవనపల్లి వీణావాణి తెలుగు కవిత: అలవాటు
అగ్గి పుట్టునో లేదో కానీ ఆగిపోతే ఎలా గెలువగలం..?! అంటూ దేవనపల్లి వీణావాణి తమ 'అలవాటు' కవితలో ఎలా ప్రశ్నిస్తున్నారో చదవండి.
పళ్ళు తోముకున్నట్టో
మురికి పడ్డ ఒళ్ళు తోముకున్నట్టో
కొన్ని పనులూ పలకరింపులూ
మర తిరగలి పట్టా మీద తిరుగుతూ
రోజులు ఖాళీ చేస్తూ
అనుభవ భారాన్ని మొస్తూ పరిగెడుతుంటాయి
కొత్తగా వుండదు
పాత బడదు
సమాధానం చెప్పకుండానే
భేతాలుడు చక్రాలు కట్టుకు వచ్చేస్తాడు
నిమ్మళంగా
సాగిపోయేది ఏది ఉందని..?
మొక్కను కూడా సాగిదీసి పెంచే ఎరువు
నీడకు కూడా విశ్రాంతినివ్వదు
నీ హస్త రేఖల చిత్రం నీ చేతిలో లేదు
చీమల బారులోనూ
మిడతల పోగులోనూ
అచ్చు పోసే ఉంచబడింది
అందులో కూర్చొని ముద్రించుకోవడమే
ఇంక యే రంగులు ఊహించకు
నయనాల నల్లని వలయాలు
మందు గోళీల డబ్బా మూత తెరిచినా
చేతికి కట్టుకున్న కాల దండం
చివరి యాత్రలోనూ అలారం మోగిస్తుంది
సుతారంగా తోక కదిలించాలంటే
ముందు వేటకు సిద్ధపడాలి
ఏయ్ నిన్నే..
కొంచం.. అలవాటు చేసుకో
కదలక పోతే
ఈడ్చుకుపోయే త్వరణ యుగం
అగ్గి పుట్టునో లేదో కానీ ఆగిపోతే ఎలా గెలువగలం..?!