దాసోజు లలిత కవిత : ముంత గూడు

కాలాన్ని బొక్కి దౌడల కింద నములుతూ ముంత గూడులో దాసుకున్న యాదులెన్నో కండ్ల కెల్లి ధారై కారుతున్నయి అంటూ దాసోజు లలిత రాసిన కవిత  " ముంత గూడు " ఇక్కడ చదవండి :

dasoju lalitha telugu poem

వంటింట్లో 
ఎండిన మోదుగాకుల దోర్నం 
సాటుకు ఉన్న ముంత గూడే 
మా అమ్మకు బీరువా 

పన్నెండు మందాల కప్పు కింద 
దాగిన ముంత గూళ్లు తనాబీలు 
తూప్రాశి తాటి దూలాలు 
పరద చెక్కల గూడులో 
నాయిన సన్నకురాళ్లు పిడిశెన మొలలు 

మట్టి యింటి మీద 
కాంక్రీటు ల్యాండ్‌ మైనేదో పేలింది 

ముంత గూడులో
అమ్మ దాసుకున్న 
ఏకానెత్తు ముక్కుపోగు
బారానెత్తు గజ్జెలనాగరం

కొలిమి పనిముట్లు 
దాతి కలపలతో 
పది మందికి పని నేర్పిన 
మా నాయన ప్రొఫెసరు 
మా అమ్మ ఆఫీసరు

మా యిల్లు 
చేతివృత్తి పనుల యూనివర్శిటీ 

శానం పదునుకు 
తెగిన యినుప సూరు 
చెక్కపేళ్ల చెత్త
దుగోడ పొల్లు చెదారం 

ఎనిమిది దశాబ్దాల నిండా
రెక్కలు పెడరెక్కలు 
ఇంకా రిటైర్‌ కాలేదు 
పెన్షన్‌ లేదు

కాలాన్ని బొక్కి దౌడల కింద 
నములుతూ ముంత గూడులో 
దాసుకున్న యాదులెన్నో 
కండ్ల కెల్లి ధారై కారుతున్నయి 

అమ్మ
సెమట సుక్క తడవని
ఇల్లు 
కూలిన ఎడారి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios