Asianet News TeluguAsianet News Telugu

దాసరి మోహన్ కవిత : పతంగి బతుకు.....

ఎగురుతున్న పతంగి బతుకును దాసరి మోహన్ కవితలో చదవండి.
 

Dasari Mohan Telugu poem, Telugu literature
Author
Hyderabad, First Published Oct 5, 2021, 4:43 PM IST

సెంటర్ కమ్మలాగ దాక్కుని
ప్రశాంతంగా  మిగలాలనుకున్న
లక్ష్యాలు పెట్టి బతుకును చింపేసారు

అడుగడుగు నిర్దేశించబడినదే
కొలతలు లెక్కలే  ప్రమాణం
పక్కోడి  కన్నా ఎక్కువ ఎగరాల్సిందే

మూడు ముడులు కట్టాక
దారం  ఆమె  చేతిలొకి
ఇక పరిధి  దాటేది  లేదు

పిల్లా పాప  అతికాక
కోరికలు  కత్తిరించబడ్డాయి
నాలుగు మూలలు మూలుగు కుంటు

బాధ్యతలు నడుము చుట్టూ
అటు ఇటు వంగేది  లేదు
రెప రెప కొట్టుకోవడం తప్ప

సమాజం నీతి చిట్టా అంటించిది
కట్టుబాట్లతో కదలిక మెలికలు
వెనకాల వెక్కిరింపులు వినబడుతూనే 

ముందుకు వెనక్కు  సతమతం
ఎదురు గాలికి ఎగిరి నప్పుడల్లా
వెనక్కే లాగుతుంటారు పని కట్టుకుని

ఎంత ఆడితే ఆంత
ఇంటిల్లి పాదికి  తమాషా
శిలువ మాత్రం నీ పైనే హమేశా

బ్రేక్ లేకుండా గారడీ
మందిని సంతోష పెట్టడానికే  పుట్టినట్లు
వురికి వురికి వూపిరి  సన్నగిల్లి  పోతోంది

దేవుడు  కనుకరించి కట్ చేస్తే  బాగుండు
చెట్టో చేమో ఒడిలో వాలి పోదు
అప్పటి వరకు  పతంగిలా
నింగికి నేలకు మధ్య  వేలాడుతూ...

Follow Us:
Download App:
  • android
  • ios