అన్యాయాలను ప్రశ్నిస్తే అవార్డు కోల్పోతామనీ తమను తాము గాంధారి పాత్రలో జీవిస్తున్నారు అంటూ దాసరి మోహన్ రాసిన కవిత ‘అంధుల శాతం అమాంతంగా…’ ఇక్కడ చదవండి : 

పక్కన బాలింతరాలు నిలుచుండి వున్నా
మొబైల్ లో తలదూర్చి తనకు 
కనపడనట్లు
మనిషి తాత్కాలికంగా అంధుడు అయిపోతాడు

పత్రికలు అన్నీ పాపాలు బట్వాడా 
చేస్తున్నాయి
టీవీలు డబ్బా కొట్టి మరీ ఘోరాలు గొల్లు
మంటున్నావి
కిరాతకాలను కామన్ అనుకుంటూ కళ్ళు 
తెరవడు

అన్యాయాలను ప్రశ్నిస్తే అవార్డ్ 
కోల్పోతామనీ
తమకు తాము గాంధారి పాత్రలో 
జీవిస్తున్నారు
కొందరి కవుల పెన్ను మూసుకుని
పోయింది

సిగ్నల్ దగ్గర చిల్లర కోసం చేయి చాపితే
కళ్ళు కరుణ కోల్పోతాయి కొన్ని క్షణాలు
మనసు మసకబారిపోతుంది రోజురోజుకి

సంపద చేకూరి కళ్ళు నెత్తికి ఎక్కుతాయి
పదవి వరించి కళ్ళు కుర్చీకి అతుక్కుని
అహం సైంధవుడు అడ్డువస్తాడు

ఎవరి స్వార్థం వారికి ఎవరి లాజిక్ వారికి
కనబడి కనపడనట్లు కనబడి బాధ్యత కాదన్నట్లు
దేశంలో అంధుల శాతం అమాంతంగా పెరిగింది…