దాసరాజు రామారావు కవిత : చిట్టిగుట్ట
పాప ఏడుపు ఎలా తగ్గింది ? గ్రైఫ్ వాటర్ పట్టారా! లేక తాత వీపు గుర్రమెక్కిందా!! తెలుసుకోవాలంటే టెక్సాస్ నుండి దాసరాజు రామారావు రాసిన కవిత ' చిట్టిగుట్ట ' ఇక్కడ చదవండి
పాప ఏడ్చింది-
ఇంట్లో బొమ్మలు అలిగినయి
ఏసీకి గొంతు నులిమినట్లున్నది
వెండిగిన్నెలో పాలబువ్వ నీరు నీరైయింది
మొగులు దిగులుగా విషాద భైరవాన్నే ఎత్తుకొన్నది
కడుపు నొప్పా? కాదేమో!
కసురు మాట తగిలిందేమో
పాప నవ్వింది-
ఆట వస్తువుల ఆట మొదలైంది
వెన్నెల ఉద్విగ్నమై, పరిమళం చిమ్మింది
గోరుముద్దలు మరింత తీపి కెక్కినయి
గగన మొగంలో హిందోళం చిందేసింది
నొప్పి తగ్గిందా?
గ్రైఫ్ వాటర్ పట్టారా!
లేదులే..
తాత వీపు గుర్రమెక్కింది గదా!!