అమ్మ
ఆకుపచ్చని ఆకుల గొడుగు పట్టుకున్న 
మహా వృక్షం!!!
చల్లటి గాలి తీయటి స్పర్శతో
పులకింప చేసే అమ్మ 
ఒక మహా వృక్షం!!!
 
వేరు పురుగు  ఒకటి ఎప్పుడు 
ఆ మహా వృక్షపు మూలాల్లో  చొరబడిందో కానీ యముని మహిషపు కాలి గిట్టల  చప్పుడు చేస్తూ 
వీచిన సుడిగాలికి పెళ్లున విరిగి
మొదలంట కుప్పలా కూలిపోయింది!
ప్రేమ అనే రెండక్షరాల పుట్టినిల్లు అమ్మ
బిడ్డల చిట్టి పెదాలకు జీవ జలాన్ని అందించిన
అమ్మ స్థనాన్ని  ఆమె నుంచి వేరు చేయడానికి కసాయిగా  మారక తప్పని డాక్టర్ కు
అమ్మను గంటలకొద్దీ కీమోథెరపీ మంటల్లోనే కాదు రేడియేషన్ గ్యాస్ పొయ్యి మీదా కాల్చక తప్పలేదు
***
మనిషికి మృత్యువు కి మధ్య పోరాటం ఈనాటిది కాదు 
కొందరు ఎదురు తిరగకుండా ఓడిపోతారు 
కొందరు చివరి క్షణం దాకా పోరాడుతూనే ఉంటారు అమ్మ ఎదురు తిరిగింది 
పోరాటపు బాట పట్టింది
మృత్యువు కన్నా  బలమైన శత్రువు లేదు కదా!
వృక్షంలో వేరుపురుగు లా ప్రవేశించి దేహమంతా ఆక్రమించి ప్రతి అంగాన్ని
ట్యూ మర్  కొరుక్కుతింటున్నప్పుడు
అమ్మ మూలుగులు విని 
చీకటి గుండెలు ఆవిసి పోయేవి 
నిశ్శబ్దం వెర్రికేకలు వేస్తూ పారిపోయేది
ఆమె శరీరాన్ని వేల కొద్దీ సూదులు పొడుస్తుండేవో రంపం ఒకటి ఆమెను ముక్కలు గా కోస్తుండేదో అనుక్షణం మృత్యువు తో పొరుతున్న ఆమె  ఆర్తనాదాలకు అర్థం తెలిసేదికాదు
కానీ ఏ క్షణమైనా బలమైన శత్రువు మృత్యువు ఆమెను మింగేస్తుంది అని అర్థం అయ్యేది
***

ఒక కాళ రాత్రి!
అమ్మ రాత్రంతా పోరాటం కొనసాగించి తెల్లవారుతుండగా అలసిపోయి
నిద్ర పోయింది శాశ్వతంగా
యుద్ధం ముగిసిపోయింది 
పాలిచ్చి బిడ్డల్ని పెంచే  తల్లుల మీద 
పంజా విసురుతున్న ఈ విచ్చలవిడి  కణాల  విజృంభణ నుంచి
అమ్మను రక్షించ లేమా?
అంపశయ్య  మీది అమ్మను కాపాడ లేమా?

(బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న అమ్మ ల కోసం)