చీదెళ్ల సీతాలక్ష్మి కవిత : పొగజూరుతున్న బతుకులు
నేడు పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి రాసిన కవిత " పొగజూరుతున్న బతుకులు " ఇక్కడ చదవండి.
పొగజూరుతున్న బతుకులు
బ్రతుకు పొగబెట్టు సిగరెట్టు
రెండువేళ్ళ మధ్య
అందంగా అమరే పొగబత్తి
పెదవి తాకగానే గుప్పున పొగలు విరిసి
మేఘాలు భువిని చేరినట్లు!!
ఎగిరే ధూపం
గాలిలో కలిసిన గంధం
ముక్కుపుటాలను తాకితే చిత్రం
జబ్బుల నీడలో విచిత్రం!!
ద్రవపదార్థం కాకున్నా త్రాగు
ధూమపానం వలన ప్రాణహాని
తెలిసినా వీడని అలవాటు
వ్యసనంగా మారెను నేడు
పొగజూరి రంగుమారిన పెదవులు
మత్తులో గమ్మత్తు
చిత్తవును బతుకు!!
పొగ వదలి పెట్ట ప్రమాదం తక్కువ
పీల్చే వారికే ప్రమాదం ఎక్కువ
చిన్న పిల్లల చెంత చేర
దగ్గుతో వారికి చెర!!
ఆరోగ్యానికి హాని అంటూ
అట్టమీదే రాతలు
అవి వట్టి నీటి మూటలు!!