చంద్రకళ దీకొండ కవిత: హక్కులేని కౌలుదారు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుండి చంద్రకళ దీకొండ రాసిన కవిత ' హక్కులేని కౌలుదారు' ఇక్కడ చదవండి.
పైసల ఆశల పల్లకీ ఎక్కిస్తారు
పేదరికపు అవసరాలు తలొగ్గుతాయి...!
సారవంతమైన క్షేత్రాన్ని
తాను చదును చేసుకుంటుంది
భూసార "పరీక్ష"లతో
దుక్కిదున్నబడిన ఆ "క్షేత్రం"లో
ఓ మేలిమిరకం బీజం నాటువేస్తారు...!
పస్తులకు అలవాటైన కడుపుకు
తనకిష్టమైనవి తిందామనే
కోరికకు ఆంక్షలు పెట్టి
పోషకాలను దండిగా అందిస్తారు...
ఖండాంతరాలనుండైనా
కఠినమైన ఆజ్ఞలు అమలుపరిచేస్తారు...!
బోలెడు మద్దతు ధర ఇస్తాం
నీ (కడుపు) పంట ఇస్తే చాలంటారు...
తాను కష్టపడి పండించిన పంటపై
హక్కులేని కౌలుదారు తాను...!
తనది కాని అంశ
తనలో పెరుగుతుంటుంది
మమకారంతో మనసు చలించకుండా
కర్తవ్యాన్ని నిర్వహిస్తూ
హామీని నెరవేరుస్తుంది...!
ఎక్కడికక్కడ పడేసిన
ఔషధాల చెత్తతో
వాడి పడేసిన అవయవ సామాగ్రితో
తాను ఖాళీ చేసిన
అద్దె ఇల్లైపోతుంది...!!!