మనసు నిండా గాఢ ఆకాంక్షలతో ఖమ్మం నుండి డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు రాసిన కవిత  " ఈ చీకటి నదిని దాటుతూ " ఇక్కడ చదవండి: 

వెలుతురు ప్రవాహపు మార్గంలో సాగిపోవాలని
ఈ చెట్లు విరబూసిన తెల్లని మల్లెల పరిమళాలను ఆస్వాదిస్తూ ఇలాగే ఇలాగే..

మనసును దోచే మల్లెల కన్నా మంచి మనసులోని ప్రేమమయ గానం నన్ను పరవశింపచేస్తుంది

బ్రతుకంతా కష్టాల కన్నీళ్ల కాలువలను దాటి ఒక వృద్ధుని అనుభవసారాన్ని ఒక గాధగా వింటున్నాను ఈ వేళ నేను

ఎన్నో రాత్రులను 
ఎన్నో వెన్నెల పున్నమి రోజులను ఆనందిస్తూ
మిత్రులతో అనురాగ సంభాషణ చేస్తూ
బ్రతుకులోని అనేక ముచ్చట్లను కష్ట సుఖాల కావడిలో మోస్తూ
నిజాయితీకి అద్దం పట్టే నడవడికను ఆకాంక్షిస్తూ
సాగిపోతూనే ఉంటాను నేను 

నా మిత్రుల కరచాలనం మధ్య వారి ప్రేమమయ శుభాకాంక్షల మధ్య అనురాగాల మధ్య ఆనందాల మధ్య విషాదాల నడుమ వాటిని దాటుకుంటూ 
ఆవలి వంతెనలో ఆనంద కాలానికి స్వాగతం పలుకుతూనే .......

ఈ రాత్రి ఇలాగే కడుపుతో రేపటి ఉషోదయాన్ని మనసు నిండా కోరుకుంటున్నాను...

అప్పటిదాకా నిరీక్షిస్తూనే ఉంటాను 
రెప్పవాల్చకుండా కన్నులతో
మనసు నిండా గాఢ ఆకాంక్షలతో.......