ఆకాశవీధిలో పయనిద్దాం ప్రపంచాన్ని మరిచిపోయి అంటూ జనగామ నుండి రాస్తున్న బుదారపు లావణ్య కవిత  " ఒకరికి ఒకరై " ఇక్కడ చదవండి. 

నీలి మేఘాలలో 
గాలి కెరటాలమై 
నిరంతరం సంచరిద్దాం 
ఇరువురం ఒకటై....

తారల తళుకులలో
తనువంతా పెనవేసుకొని
తన్మయంతో..... 
పంచుకుందాం వలపులన్ని

తెల్లని మనసుపై రంగుల 
హరివిల్లును అద్దుకొని
గగనవిహారం చేద్దాం
జంట పావురమై....

మరులు గొలిపే ప్రేమలో
మరువలేని జ్ఞాపకాలు
మది నిండా నింపుకొని
మయూరమై నాట్యం 
చేద్దాం ఒకరికి ఒకరై....

సృష్టిలోని అందాలన్నీ ఆస్వాదిస్తూ.....
నీకు నేనై నాకు నువ్వై 
ఒకరికి ఒకరై
ఆకాశవీధిలో పయనిద్దాం 
ప్రపంచాన్ని మరిచిపోయి
ఆకాశవీధిలో పయనిద్దాం
ప్రపంచాన్ని మరిచిపోయి.