ప్రఖ్యాత బ్రిటీష్ రచయిత, చరిత్రకారుడు పాట్రిక్ ఫ్రెంచ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన గురువారం లండన్‌లో తుదిశ్వాస విడిచారు. ఫ్రెంచ్ పాట్రిక్ మరణం పట్ల ప్రముఖ రచయితలు విలియం డాల్రింపుల్, రామచంద్ర గుహ తదితరులు సంతాపం తెలిపారు. 

ప్రఖ్యాత బ్రిటీష్ రచయిత, చరిత్రకారుడు పాట్రిక్ ఫ్రెంచ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన గురువారం లండన్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య మేరు గోఖలే, నలుగురు పిల్లలు వున్నారు. మేరు గోఖలే గతంలో పెంగ్విన్ గ్రూప్‌లో పబ్లిషర్‌గా పనిచేశారు. ఈరోజు ఉదయం 8.10 గంటలకు తన భర్త పాట్రిక్ ఫ్రెంచ్ క్యాన్సర్‌పై పోరాడి లండన్‌లో కన్నుమూసినట్లు మేరు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన పంచిన ప్రేమ ఎప్పటికీ తమతోనే వుంటుందని మేరు గోఖలే అన్నారు. 

1966లో ఇంగ్లాండ్‌లో జన్మించిన పాట్రిక్ ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ నుంచి దక్షిణాసియా స్టడీస్‌పై పీహెచ్‌డీ చేశారు. ఇంగ్లీష్, అమెరికన్ సాహిత్యాలపై ఎంఏ చేశారు. 1947లో స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత భారతదేశ రాజకీయ , సామాజిక విశ్లేషణపై పాట్రిక్ దృష్టి సారించారు. అంతేకాదు.. 1990లలో భారతదేశ గతిని మార్చిన సరళీకరణపైనా పాట్రిక్ పనిచేశారు. రచనలు, విద్యా సంబంధమైన వ్యవహారాలతో పాటు రాజకీయాల్లోనూ ఆయన ప్రవేశించారు. 1992లో గ్రీన్ పార్టీ అభ్యర్ధిగా యూకే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 

యంగ్ హజ్బెండ్, లిబర్టీ ఆర్ డెత్, టిబెట్ టిబెత్ , ది వరల్డ్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అనే పుస్తకాలను రచించారు. ది వరల్డ్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్‌కు గాను నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్, హౌథ్రోన్‌డెన్ ప్రైజ్‌ను ఆయన గెలుచుకున్నాడు. వీటితో పాటు సండే టైమ్స్ యంగ్ రైటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ హీన్‌మాన్ ప్రైజ్, సోమర్సెట్ మౌఘమ్ అవార్డును పాట్రిక్ అందుకున్నారు. అలాగే జూలై 2017లో అహ్మదాబాద్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తొలి డీన్‌గాను పాట్రిక్ నియమితులయ్యారు. గతేడాది జూలైలో ఆ హోదా నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 

ఫ్రెంచ్ పాట్రిక్ మరణం పట్ల ప్రముఖ రచయిత విలియం డాల్రింపుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ఇద్దరికీ 13 ఏళ్ల చిరుప్రాయం నుంచి పరిచయం వుందన్నారు. ఆయన మరణవార్తతో తన గుండె పగిలిపోయిందని విలియం ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ ముఖంపై చిరునవ్వుతో, ఉత్సాహంతో వుండేవాడని.. పాట్రిక్ మా తరంలో గొప్ప బయోగ్రాఫర్ కూడా అని విలియం డాల్రింపుల్ ప్రశంసించారు. 

మరో ప్రఖ్యాత రచయిత రామచంద్ర గుహ సైతం పాట్రిక్ మరణం పట్ల సంతాపం తెలిపారు. పాట్రిక్ మరణవార్త తనను ఎంతో బాధించిందని.. ఆయన రాసిన ఫ్రాన్సిస్ యంగ్‌హజ్బెండ్ vs నైపాల్‌లు ఆధునిక జీవిత చరిత్ర రచనల్లో క్లాసిక్స్‌గా రామచంద్ర గుహ అభివర్ణించారు. ఆయన గొప్ప మానవతావాది అని కొనియాడారు.

Scroll to load tweet…