బిల్ల మహేందర్ కవిత: లాక్ డౌన్ మాకు కొత్త కాదు!

'యాక్సెస్‌బిలిటీ' అనేది దివ్యాంగుల ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రధానమైన అంశం.  పాలకులు, అధికారులు  జాలితో కాకుండా చిత్తశుద్ధితో  ప్రత్యేక శ్రద్ధను కనబరిచి  దివ్యాంగులను సమాజంలో అందరితో సమానంగా భాగస్వామ్యం చేయాలని హన్మకొండ నుండి బిల్ల మహేందర్  రాసిన "లాక్ డౌన్ మాకు కొత్త కాదు!" కవితను ఇక్కడ చదవండి

Billa Mahender Telugu poem Lock down not new one

ఇప్పుడేది
కొత్తగా అనిపించడం లేదు
వింతగానూ తోచడం లేదు

రోజూలాగే ఉదయాలు సాయంత్రాలు రాత్రుళ్ళన్నీ
కిటికీ ఊచల్లోంచి వెళ్ళిపోతున్నాయి
చిరుగాలుల తాకిడికి 
పూలు ఊయలూగుతూ దోబుచులాడుతున్నాయి
పలుకులను నోటకరుచుకున్న పిచుక
కళ్ళముందు వాలుతూ మాటల మూట విప్పి ఎగిరిపోతున్నాయి

              *.         *.         *

గది నాలుగు గోడల మధ్య
నడుము వొంగి, చేతులు చచ్చుబడి, కాళ్ళలో పట్టులేక నిలబడలేని బతుకు
ఏనాడో క్వారంటైన్ కు చేరింది

బుద్ధిపుట్టో, ఆశ చావకనో 
ఎన్నడైన సాహసించి రెండు చక్రాల బండిని గడపవతలికి లాగితే
'యాక్సెస్‌బిలిటీ' అడుగడునా వెక్కిరిస్తూ వెనుకకు లాగేసి
బతుకునెప్పుడో లాక్ డౌన్ చేసింది

క్రిమి
ఇవ్వాల ఉండొచ్చు, రేపు లేక పోవచ్చూ
క్వారంటైం గడువు 
వారమో, మరొక వారంలోనో ముగిసి పోవచ్చూ
ఓ నిర్ణీత సమయాన అధికారకంగా లాక్ డౌన్ బ్రేక్ కావచ్చూ
ముగిసి పోనిది
బ్రేకప్ కానిది
ఇక్కడ మా బతుకులు మాత్రమే!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios