Asianet News TeluguAsianet News Telugu

తెలుగులో దక్షిణాఫ్రికా కవిత: పరాయిభాషకు ప్రణమిల్లుతూ

వలస మన అస్తిత్వాన్ని ఎలా మింగేస్తుందో ప్రముఖ కథా రచయిత అయోధ్యారెడ్డి ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం చేసిన కవితలో చదవండి

Ayodhya Reddy tranlsted poem in Telugu
Author
Hyderabad, First Published Jul 16, 2021, 3:44 PM IST

నా ఇంటిపేరు పదునైన విదేశీ ఆయుధమై
ప్రతిక్షణం నా నాలుకను కత్తిరిస్తుంటుంది 
ఆ ఇంటిపేరు తనదని మాతండ్రి గర్వంగా చెప్పుకుంటాడు
కాదు, తనదేనని ఆయన తండ్రి భీష్మించుకుంటాడు
నాతల్లి మాత్రం.. 
అదే ఇంటిపేరుని తనపేరుకు ముందు అతికించుకుని సగర్వంగా మోసుకెళుతుంది
అంతేకాదు, 
పరాయి భాషలో దాన్ని పలికేందుకు
నాలుక మడతలు చుడుతూ ప్రయాస పడుతుంది
నా హృదయం ఒక విదేశీ ప్రపంచంలో ఘనీభవించి 
దేవకన్యలా వయసు మీరుతూ ఉంటుంది 
నేనో ధూళిరేణువై విడిపోతున్నందుకు
నాపై కోపగించుకుంటాను
నా మాతృభాషలో పదంకెల వరకూ లెక్కించి      
ఆ పదాలు సరిగా పలకాలనుకుంటాను  
'బంటూ' భాషలో కవిత్వాన్ని వినిపిస్తున్న   
నా నోటి చిత్రపటం దగ్గరే ఆగిపోయి నిలిచిపోతాను
ఎప్పుడో చిన్నతనాన తరగతి గదిలో 
నా ఇంటి పేరుకు తగిన స్థానం కల్పించేలా
మాట్లాడటం నేర్చుకున్నా
నా భాషలో గణించడమూ తెలుసుకున్నా
కానీ మా ఇంట్లో మాత్రం.. దీనిబదులు
ధన్యవాదాలు చెప్పడమే నేర్పారు
నేను పరాయి భాషల శ్మశానాల్లో 
నా దేవుణ్ణి దహనం చేశాను
పరాయి భాషలో పలికే దేవతలకే ప్రతిష్టాపన చేశాను  
నేను 'జూలు'లో జన్మనిచ్చా,
కానీ తల్లిగా ఇంగ్లీషులో నన్ను తిరిగి పట్టుకొని మాతృభాషను ఇంటికి రప్పిస్తాను
అయితే ఇక్కడ, నా ఇంటిపేరు ఇప్పటికీ 
ఒక సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది
మేమంతా మా ఉనికితోసహా సముద్రాల మధ్య
ద్వీపాలుగా బందీలమై పోయినం. 
పరాయి భాషల్లోకి మమ్మల్ని మేము కోల్పోయినం
మొదటిసారి నా చివరి పేరును 
మొదటి పేరు కింద రాయాల్సిరావడం బాధాకరం
చివరికి అదే నా మొదటి పేరుగా మారి 
నిత్యం దాన్నొక వేషంగా ధరించి తిరుగుతుంటాను
నా జ్ఞాపకశక్తి సరైనదయితే
నా ఇంటిపేరు ఒకానొక చారిత్రక గాయానికి పుట్టిందే
మేమంతా ఒక వంశ వృక్షానికి వేలాడబడుతూ
రక్తాన్ని స్రవించడం సైతం మరిచిపోయాం
పరభాషని ఎప్పడు..యెలా హత్తుకున్నామో కూడా గుర్తులేదు
అది కల్పించే ప్రత్యేక సౌకర్యాల, హోదాల వలయంలో
దారితప్పి తలొగ్గుతూ మౌనం వహించాం
కానీ, మాఇంట్లో దీనిబదులుగా 
ధన్యవాదాలు చెప్పటమే నేర్పించారు.

ఆంగ్లమూలం: సిబోంజిలే ఫిషర్ (దక్షిణాఫ్రికా)
తెలుగు అనువాదం: అయోధ్యారెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios