అవనిశ్రీ కవిత : ఐక్యత + అనైక్యత = కులం
ఇక్కడ జాతుల సంఖ్యాబలం ఎక్కువుండడం మంచిదే. ఐతే సదరు గుంపంత గంప గుత్తగా విడిపడి ఉండటం ఓ సామాజిక నేరం అంటూ అవనిశ్రీ రాసిన కవిత : ఐక్యత + అనైక్యత = కులం ఇక్కడ చదవండి :
ఎక్కడైన ఎప్పుడైన
ఆధిపత్య కులాలలో ఒకడు తప్పుజేస్తే
అతడిని తప్పించడానికి
కింద నుండి పైదాకా అందరూ ఏకమై
తల్లికోడికింద పిల్లల్ల కాపాడుకుంటరు
ఇదీ వాళ్ల ఐక్యతకు చిహ్నం.
కింది కులాలలో
ఎవరిమీదనైన నిందమోపబడితే
మన కింది కులాల పెద్దలంత
రాబందులై ఎగబడి
ఆ బక్క జీవిని శిక్షించి
లోలోపల సంతోషపడతారు
ఇది మన అనైక్యతకు బండగుర్తు.
ఈ నేలమీద
పిడికెడున్న జనమే
పిడికిలిలా బలంగా ఉంటరనేది
ఓ చారిత్రక సత్యం.
ఇక్కడ జాతుల సంఖ్యాబలం
ఎక్కువుండడం మంచిదే
ఐతే సదరు గుంపంత గంప గుత్తగా
విడిపడి ఉండటం ఓ సామాజిక నేరం.