అందుకున్నాను: అటల్ బిహారీ వాజ్ పేయి కవిత్వ తాత్వికత

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం అటల్ బిహారీ వాజ్ పేయీ “ ఎంపిక చేసిన కవితలు” (SELECTED POEMS by ATAL BIHARI VAAJPAYEE) అందిస్తున్నారు వారాల ఆనంద్ .

Atal Bihari Vajpayee poetry reviewed by Varala Anand

ఇటీవల ఒక ఆత్మీయ మిత్రుడు ఈ పుస్తకం చూసావా అంటూ ‘ATAL BIHARI VAAJPAYEE SELECTED POEMS’  పుస్తకాన్ని ఇచ్చాడు. చాలా రోజులనుంచి చూడాలనుకున్న పుస్తకం. చాలా ఏళ్లనుంచి నేను చదవాలనుకున్న కవి అటల్ బిహారీ వాజ్ పేయీ. ప్రధాన స్రవంతిలో వున్న పెద్ద రాజకీయ నాయకుడిలో  గొప్ప కవి హృదయాన్ని ఊహించడం కష్టమే.  కానీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది  గొప్ప రాజకీయ నాయకులు గొప్ప కవులుగా రచయితలుగా నిలబడ్డ వారున్నారు.  వారి వారి తాత్వికతని దృక్పధాన్ని తమ రచనల్లో ఆవిష్కరించి సాహిత్య ప్రపంచంలో నిలదొక్కుకున్నవారున్నారు.  మన దేశంలో అలా కవితా హృదయమున్న రాజకీయ నాయకుల్లో అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రముఖుడు. తన అనుభవాలని, నమ్మిన విశ్వాసాలనీ కవిత్వీకరించిన అటల్ బిహారీ వాజ్ పేయీ ఎంపిక చేసిన కవితల సంకలనం గురించి ఈ వారం “అందుకున్నాను”లో నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నాను. వాజపేయీ ‘మేరీ ఎక్యావన్ కవితాయే(MY 51 POEMS),  ‘న దైన్యం న పలాయనం’ (NEITHER COWARD NOR AN ESCAPIST ) సంకలనాల్లోంచి ప్రఖ్యాతి గాంచిన 22 కవితల్ని ఎంపిక చేసి అరవింద్ షా ఇంగ్లీష్ లోకి అనువదించారు. వాటితో పాటు అటల్ బిహారీ వాజ్ పేయీ జీవితం, వ్యక్తిత్వాలపైన అరవింద్ షా రాసిన బయో గ్రాఫికల్ కవితలతో కూడిన సంకలనమిది.

అటల్ బిహారీ వాజ్ పేయీ అనగానే గొప్ప వక్తగా, దేశ ప్రధానిగా  మనకు కనిపిస్తాడు. అంతేకాదు తాను నమ్మిన సిద్ధాంతాలకు ఆజన్మాంతం కట్టుబడి  వున్న రాజకీయ నాయకుడిగానూ కనిపిస్తాడు. మొదట జర్నలిజంతో తన జీవితాన్ని ఆరంభించిన ఆయన ‘రాష్ట్రీయ ధర్మ’ పత్రికకు సంపాదకుడిగా పని చేసాడు. ఆ పత్రిక పని వత్తిడిలో కవిత్వం రాయడం కొనసాగించలేక పోయానని ఆయనే రాసుకున్నాడు. నిజానికి గొప్ప భావుకుడయిన అటల్ బిహారీ వాజ్ పేయీకి కవిత్వం ఒక రకంగా ఇంట్లో వారసత్వంగా సంక్రమించిందని చెప్పుకోవచ్చు. ఆయన నాన్నగారు పండిట్  కిషన్ బిహారీ వాజ్ పేయి గ్వాలియర్ సంస్థానంలో ప్రముఖ కవి. ఆయన ప్రాంతీయ భాషలోనూ బ్రిజ్ భాషలోనూ కవిత్వం రాసారు.  వాజ్ పేయి తాత శ్యాంలాల్ వాజ్ పేయి , అన్న అవధ బిహారీ వాజ్ పేయీలు కూడా సాహిత్యంతో సంబంధం వున్న వారే. అటల్ బిహారీ వాజ్ పేయీ తన విద్యార్థి దశ నుండే కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. స్కూల్ మాగజైన్ లలో ఆయన కవితలు అచ్చవుతూ ఉండేవి.  శ్యాం ప్రసాద్ ముఖర్జీకి రాజకీయ కార్యదర్శిగా ఆయన తన రాజకీయ జీవితం ఆరంభించారు. మొట్టమొదటిసారిగా 1957 లో బల్రాంపూర్ నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తర్వాత 11 సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అట్లా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాక ప్రసంగాల పైననే ప్రధానంగా దృష్టి సారించి గొప్ప వక్త గా నిలిచాడు. ఆ క్రమంలో కవిత్వం వెనక బట్టింది. రాజకీయాల్లో ఉంటూ కవిత్వం గురించి ఆలోచించే సమయంగానీ వాతావరణంగానీ తనకు  కరువయ్యాయని అటల్ బిహారీ వాజ్ పేయీ ఒక చోట రాసుకున్నారు.

అయితే ఎమర్జెన్సీ కాలంలో జైలులో వున్నప్పుడూ, జనతా పార్టీ విచ్చిన్నమయినప్పుడూ, ఇంకా అలాంటి తనకు బాధాకరమూ, విపత్కరమూ అయిన సందర్భాల్లో వాజ్ పేయీ కవిత్వం రాసి తన వేదనను ప్రజలతో పంచుకున్నారు. అట్లా రాసిన కవితల్లోంచి ఎంపిక చేసిన ఈ కవితల్లో భారతీయత, మాతృభూమి పైన మమకారం, ఆయన శాంతి కాముకత్వం, స్పష్టంగా కనిపిస్తాయి.

“మేము యుద్ధాన్ని కోరుకోము
విశ్వ శాంతిని కాంక్షిస్తాము
మరణాలని దిగుబడిగా పొందేందుకు
పొలాల్లో రక్తాల్నిపారనీయం .." అంటారు వాజ్ పేయి.

మరో కవితలో...

‘నేను అంత త్వరగా ఓటమిని అంగీకరించను
యుద్ధాన్ని సరికొత్తగా ఆరంభిస్తాను
గెలుపు చట్రంలో ఓ కొత్త గీతాన్ని
మళ్ళీ మళ్ళీ రాస్తాను...పడతాను...’ అని అంటారు.

ఇక తన తాత్విక భావాలతో కూడా అటల్ బిహారీ వాజ్ పేయీ మంచి కవిత్వం  రాసారు..

‘రోజు తర్వాత రోజు ఇవ్వాళ కూడ
కాలం గడిచిపోతుంది
గత భవిష్యత్ ఉద్వేగాలతో
వర్తమానం కోల్పోతాం...’

ఇట్లా అటల్ బిహారీ వాజ్ పేయీ కవిత్వం నిండా తన ఆలోచనలు అనుభూతులు ఆవిష్కృత మవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే పి.వి. నరసింహా రావు లాగే అటల్ బిహారీ వాజ్ పేయీ కూడా కవిత్వాన్నే తన కార్యస్థలంగా ఎంచుకుని వుంటే విశ్వవ్యాప్త కవిగా పేరుగడించి సాహితీ ప్రస్తానం కొనసాగించేవారు.

గొప్ప నాయకుడిగా తనదైన వ్యక్తిత్వంతో చివరంటా నిలిచిన వాజ్ పేయీ SELECTED POEMS by ATAL BIHARI VAAJPAYEE  లోంచి కొన్ని అనువాదాలు మీకోసం....

మూలం: అటల్ బిహారీ వాజపేయి
స్వేచ్చానువాదం : వారాల ఆనంద్

'రెండు అనుభూతులు'

           - మొదటి అనుభూతి

లోతయిన మరకలు, బహిర్గతమవుతున్న ముఖాలు
ఇంద్రజాలం ముక్కలై, ఇవాళ నిజంగా భయమవుతున్నది
ఇప్పుడు పాట పాడలేను
పగిలి వెదజల్లబడ్డ గాజు ముక్కల్లాంటి నగరంపై దృష్టి పడింది
నా వాళ్ళ జాతరలో నేను  కలువలేకున్నాను
ఇప్పుడు పాట పాడ లేను
కడుపుపై కత్తిలాంటి చంద్రుడు  
రేఖ ఉచ్చులో నిలిచిపోయాను 
ముక్తి క్షణాల్లో మళ్ళీ మళ్ళీ బంధింప బడతాను
నేనిప్పుడు పాట పాడలేను

            -  రెండవ  అనుభూతి

ఇప్పుడొక కొత్త పాట పాడతాను
పగిలిన చుక్కల్లో బసంతీ రాగం వినిపించింది బండలాంటి ఛాతీలో కొత్త అంకురం మొలకెత్తింది
నదులన్నీ పసుపువర్ణం అద్దుకుని
కోయిల రాత్రుల్ని తలపిస్తున్నాయి
తూర్పున అరుణ వర్ణపు ఛాయలు చూడగలుగుతున్నాను
ఇప్పుడు కొత్త పాట పాడతాను
పగిలిన స్వప్నాల విషాదాన్ని ఎవరు వింటారు
లోపలి పగుళ్ళ దుఃఖం కనుపాపల్లో ద్యోతకమవుతున్నది
ఓటమిని అంగీకరించను పోరు దారిని విడువను
కాలం యొక్క కపాలం పై లిఖిస్తూ తుడిచేస్తూ వుంటాను
ఇప్పుడు సరికొత్త పాటను పాడుతూనే వుంటాను

                                ****

 కలలు విచ్చిన్న మయ్యాయి

చేతులు పసుపు పారాణితో అలంకరించాము
పాదాలు గోరింటాకులో తడిసి ముద్దయ్యాయి
కానీ
కనురెప్ప పాటులో
కల విచ్చిన్నమయి పోయింది
దీపావళి వేడుకలకు ముందే
దీపం ఆరిపోయింది
సూర్యోదయపు ఆహ్వాన పత్రిక
వృధా అయిపొయింది
కల విచ్చిన్నమయి కూలి పోయింది
ప్రకృతి నాటకం కడు విచిత్రమయింది
ప్రతిదీ బలికి సిద్దం
రెండు అడుగులేసి దళాలు వేరు పడ్డాయి
కలలు విచ్చిన్నమయి
ధ్వంసమయి పోయాయి 
(1979లో జనతా పార్టీ విచ్చిన్నమయి పోయినప్పుడు రాసిన కవిత)

                                  ****

సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు

సర్వత్రా కొత్త బానిసత్వం పరుచుకున్న వేళ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుందాం
భూమి ఎడారి అయింది 
ఆకాశమంతా దైన్యం నిండింది
శరీరమూ మనసూ
మట్టితోనూ మురికితోనూ నిండిపోయాయి
లోన కమలాలు వాడిపోయాయి
ఒకటి తర్వాత ఒకటిగా
దీపాలు ఆరిపోయాయి
జైలులో బందీగా వున్న ఖైదీకి
ఓ పిలుపొచ్చింది
మనసును చిన్న బుచ్చుకోకు
చీకటి పొరల్ని చీల్చుకుని
సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు ప్రకాశిస్తాడు.

( ఎమర్జెన్సీ కాలంలో జైలు లోపల బందీగా వున్నప్పుడు రాసిన కవిత )

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios