అరుణ ధూళిపాళ కవిత : మార్చుకో నిన్ను నీవు !!
గమ్యం నీకు చేరువలో లేదంటే తప్పు నీదే అవుతుంది అంటూ అరుణ ధూళిపాళ రాసిన కవిత ' మార్చుకో నిన్ను నీవు !!'
మనిషి మనసు తపనల్లో
తుది దాకా చేరని ఆశలు
గుండె మంటలో ఆవిరైపోతాయి
గాయాలు అందులోనే పుట్టి,
అక్కడే కనుమరుగవుతాయి
గమ్యం నీకు చేరువలో లేదంటే
తప్పు నీదే అవుతుంది
స్థితులు, గతులు
తప్పుకోవడానికి ఆసరాలు
తప్పించుకోవడం అంటే,
ఆత్మను బలిపెట్టడమే
కావాలనుకున్నది కానప్పుడు
అవకాశమే సొంతమవుతుంది
ఆట ఎక్కడ మొదలయిందో అర్థమవ్వాలంటే
తవ్వి చూడాలి ఆత్మను నిశితంగా
గత చరిత్రను శోధించినట్టు
మంచి, చెడుల నీలినీడల
గురుతులను సేకరించాలి
అడుగంటిన సత్తువను వెలికి తీసి
అంతరంగపు సంఘర్షణలకు ముసుగేసి
ఆలోచనలకు పదునుపెట్టి
నీలోని నిన్ను మార్చుకొని చూడు
మనిషిగా పుట్టిన విలువ
సమాజానికి సమాధానమవుతుంది.