Asianet News TeluguAsianet News Telugu

తెలుగు అనువాద శిఖరం జలజం

నిన్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ లోగల కాళోజీ హాల్ లో "జలజం... ఒక జ్ఞాపకం" పేరిట స్మారక సభను, కవిసమ్మేళనాన్ని నిర్వహించారు.  ఆ వివరాలు ఇక్కడ చదవండి 

Another name for translation is 'Jalajam' - bsb - opk
Author
First Published Nov 6, 2023, 2:18 PM IST | Last Updated Nov 6, 2023, 4:20 PM IST

తెలుగు సాహిత్యరంగంలో అనువాద రచయితగా పేరుగాంచిన కవి, రచయిత, విద్యావేత్త జలజం సత్యనారాయణ అని వక్తలు ప్రశంసించారు. నవంబర్ 5 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ లోగల కాళోజీ హాల్ లో "జలజం... ఒక జ్ఞాపకం" పేరిట స్మారక సభను, కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రజా వాగ్గేయకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, శాసనమండలి సభ్యులు గోరటి ఎంకన్న మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో పలు అనువాద గ్రంథాలను రచించిన జలజం సత్యనారాయణ గొప్ప మానవతామూర్తి అని, అభ్యుదయవాది అని కొనియాడారు. అటు ఆధ్యాత్మిక, ఇటు అభ్యుదయ గ్రంథాలను రచించడం జలజం సత్యనారాయణకే చెల్లిందన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారన్నారు. సమసమాజాన్ని ఆకాంక్షించిన అసలైన మానవతావాది అని కొనియాడారు.

ముఖ్యవక్తగా విచ్చేసిన ప్రముఖ పరిశోధకులు, కాలమిస్ట్ డాక్టర్ పి.భాస్కరయోగి‌ మాట్లాడుతూ జలజం సత్యనారాయణ భారతీయ గ్రంథాలనే కాకుండా విదేశీ రచయితల గ్రంథాలను కూడా అనువాదం చేయడం గొప్ప విషయమన్నారు. వాజపాయ్ కవితలను తొలిసారిగా తెలుగులోకి శిఖరం పేరిట అనువదించినది జలజం సత్యనారాయణ ఒక్కరేనని కొనియాడారు. కబీర్ దాస్ దోహాలను కబీర్ గీతగా అనువదించడం ఎంతో సాహసమేనన్నారు. బహుముఖీన రచయితగా జలజం సత్యనారాయణ పేరుగాంచారన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ జలజం మొదట్లో కమ్యూనిజాన్ని ఆదరించినా అనంతరం తన మార్గాన్ని మార్చుకున్నారన్నారు. ఒకవైపు అభ్యుదయ కవిత్వాన్ని, మరొకవైపు ప్రేమ కవిత్వాన్ని రాయడం జలజం కలం గొప్పదనమన్నారు. 

ఆత్మీయ అతిథి లుంబిని హైస్కూల్ పాఠశాల అధినేత కె.లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ జలజం సత్యనారాయణ గతించి రెండు సంవత్సరాలైనా అతని జ్ఞాపకాలు మన నుంచి పోలేదన్నారు. జలజం ఒక జీవనది అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి మట్లాడుతూ పాలమూరు జిల్లాలో ఒక గొప్ప అనువాదకుడు జలజం మనమధ్యన లేకపోవడం జిల్లాకే తీరని లోటన్నారు. కార్యక్రమ సంయోజకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మిణుకుమిణుకుమంటున్న అనువాదరంగంలో ఒక ధృవతారలా వెలిగిన ఆణిముత్యం జలజమని కొనియాడారు. ప్రపంచభాషల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించిన సృజనాత్మక రచయిత అని ప్రశంసించారు. అనంతరం "జలజం... ఒక జ్ఞాపకం" అనే అంశంపై నిర్వహించిన కవిసమ్మేళనంలో కవితలు చదివిన వారందరిని జలజం విదుషిరాయ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కవులు దేవదానం, వనపట్ల సుబ్బయ్య, మద్దిలేటి, బోల యాదయ్య, లక్ష్మీనరసింహ, పులి జమున, సత్యవతి తదితరులు కవితాగానం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios