Asianet News TeluguAsianet News Telugu

అన్నవరం దేవేందర్ కవిత: ఆధిపత్యం

సకల ఆధిపత్యాలను దిక్కరిస్తేనే ధీరత్వం అని కరీంనగర్ నుండి అన్నవరం దేవేందర్  అందిస్తున్న కవిత 'ఆధిపత్యం' ఇక్కడ చదవండి. 

Annavaram Devender Telugu poem, Telugu literature
Author
Karimnagar, First Published Sep 5, 2021, 4:08 PM IST

ఆధిపత్య అంకురానికి ఆదినుంచే పైత్యం
మొలకెత్తిన చిగుర్లకు అహం వాసన
రెమ్మ రెమ్మలుగా విస్తరించిన ముళ్ళ తీగ

కడప లోపలే మొదలవుతుంది ప్రతాపం
తొలుత మగ పురుగు రూపంలోనే తొలుస్తది
గాయమైతది కానీ నెత్తురు తెలువది

పెనిమిటి ఎట్లాగూ పెత్తతనపు మారుపేరు
అధికారం అత్త రూపంలోని అగ్రహ స్వరం
ఓరిమితో ఒదిగినా నెత్తి మీద ఒత్తిడి

పని చేసే చోట  పైవాడొక పచ్చని సర్పం
మాట మాటల్లోనూ బుస బుసల కాలుష్యం
అన్ని కార్యాలయాలూ మగనీతుల నిచ్చెన మెట్లు

పెద్దతనపు గౌరవం గానుగెద్దు వర్తులం
మర్యాదల రూపం భుజం దిగని దాసోహం

ఆలోచనల స్వేచ్ఛకు తరతరాల ఆటంకం
దాచి ఉంచేందుకే ఆచారమైన వ్యూహం

ఆచరిస్తున్నంత వరకే పరంపరల పర్వం
స్వతంత్ర ధార మొదలైతే పటాపంచలే
సకల ఆధిపత్యాలను దిక్కరిస్తేనే ధీరత్వం.

Follow Us:
Download App:
  • android
  • ios