అమ్మంగి వేణుగోపాల్ కవిత : మన బీసీలు
ధిక్కరిస్తే చక్రవర్తులు - దీనులైతే క్షతగాత్రులు అంటూ అమ్మంగి వేణుగోపాల్ రాసిన కవిత ' మన బీసీలు ' ఇక్కడ చదవండి :
చుక్క చుక్కతో ఆకాశం
చెట్టు చెట్టుతో అరణ్యం
బక్క చీమలతోనే సృష్టి
బీసీలతోనే ఈ ప్రపంచం
నాయకుల సింహాసనాలకు
నాలుగు కాళ్ళు మన బీసీలే
' సోదర సోదరీమణులారం 'టే
మరెవరో కాదు మన బీసీలే
వృత్తి పనుల శక్తిమంతులు
కళల స్రష్టలు కవివరేణ్యులు
కత్తిపట్టి యుద్ధాలు చేసిన
మేటి సైనికులు మన బీసీలే
జెండా కర్ర తమ గుండెలొ నాటిన
త్యాగధనులు దేశభక్తులు
సమాజ సంపద సృష్టికర్తలు
వెనకవేయబడిన శ్రామికులు
మ్యానిఫెస్టోలో మహారాజులు
ఎన్నికల తెల్లారి కీలుబొమ్మలు
హక్కులు లేని బక్కమనుషులు
ఎవరోకాదు మన బీసీలే
ధిక్కరిస్తే చక్రవర్తులు
దీనులైతే క్షతగాత్రులు
నెత్తురోడుతూ ఇంకెంతకాలం ?
తలెత్తుకొని పోరాడక తప్పదు
చుక్క చుక్కతో ఆకాశం
చెట్టు చెట్టుతో అరణ్యం
బక్క చీమలతోనే సృష్టి
బీసీలతోనే ఈ ప్రపంచం