అమ్మంగి వేణుగోపాల్ కవిత : హైదరాబాదు వాన
అమ్మ కోపం లాంటిది "హైదరాబాదు వాన" అంటున్న అమ్మంగి వేణుగోపాల్ కవిత ఇక్కడ చదవండి.
పాల ధారలా మొదలవుతుంది హైదరాబాదు వాన
చిన్నారుల 'వానావానా వల్లప్ప' కు స్టెప్పులేస్తుంది
పూరింట్లోకి చాపకింద నీరై
రేకులింటి మీద బాజా భజంత్రీలై
కవేలీ కప్పు నుంచి జలధారా యంత్రమై
క్రమంగా
సూదులై సూక్ష్మాలై సూచీముఖాలై
చురకత్తులై బాణాలై ఈటెలై
విశ్వరూప ప్రదర్శన చేస్తుంది
ఆదిమ శక్తితో తాండవం చేస్తుంది
సముద్రంలా తడవెత్తినా
హుసేన్ సాగర్ చెలియలికట్ట దాటదు
మూసా ఈసీలు చింగులు గోసిపెట్టి
పిల్లలు గలీజు చేసిన ఇంటిని కడుక్కుంటాయి
వార్తలు టీవీలను ముంచెత్తుతాయి
అంతులేని మానవ దుఃఖం పిల్లకాలువై
డ్రైనేజీలోకి పారుతుంది
అయినా
బడి పిల్లలకు మహా అయితే ఒక్క అదనపు ఆదివారం
వస్తుంది
అమ్మ కోపం లాంటిది హైదరాబాదు వాన
దక్కన్ పీఠభూమికి సూర్యునికి
మేనరికం ఉన్నట్టుంది
ఒక్కరోజు ఎడబాటుకే ఉక్కిరిబిక్కిరైన సూర్యుడు
తెల్లవారగానే
తాజా ఇరానీ ఛాయ్ లా పొగలు కక్కుకుంటూ వచ్చి
కవోష్ణ కిరణాలతో కౌగిలించుకుంటాడు
అతిశయోక్తులు లేని కవిత్వం మా హైదరాబాదు వాన.