Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్ కన్నీరు... ఆఘా షాహిద్ అలీ రాసిన ‘ద వేయిల్ద్ సూట్’

 అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం The Vield Suit (collected poems) By agha shahid ali అందిస్తున్నారు వారాల ఆనంద్.

agha shahid ali the veild suit (collected poems)
Author
Hyderabad, First Published May 23, 2022, 5:30 PM IST

ఆఘా షాహిద్ అలీ రాసిన ‘ద వేయిల్ద్ సూట్’ ( కలెక్టేడ్ పోయెమ్స్) ను అందుకుని చాలా కాలం అయింది. చదవడం ఆరంభించి కూడా చాలా రోజులే అయింది. సమయం దొరికినప్పుడల్లా చదువుతూనే వున్నాను.  ఆఘా షహీద్ అలీ విలక్షణమయిన కవి. తనను మళ్ళీ మళ్ళీ చదవడం వలన ఎన్నో కొత్త కోణాలు తెలుస్తున్నాయి. ఇంకా తెలవాల్సినవీ తెల్సుకోవాల్సినవీ వున్నాయి. ఆయన కవిత్వం నిండా కాశ్మీర్ పట్లా కాశ్మీర్ లో జరిగిన అత్యాచారాలు అరాచకాల పట్ల కోపమూ వేదనా కనిపిస్తాయి. అయితే ఆ భావనలన్నీ కవిగా గొప్ప మానవ గాంభీర్యత, నైతిక ప్రేమలతో ప్రకటిస్తాడు. తను తన కవిత్వం మొత్తంగా ఇంగ్లీషులోనే రాసాడు. మొదట వచన కవిత్వం ఫ్రీ వర్స్ తో ఆరంభించినప్పటికీ కాల క్రమంలో ఆంగ్ల వచన కవిత్వంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రాస్తూ వచ్చాడు. గజల్ రూపాన్ని చాలా ఇష్ట పడ్డాడు.

ఆఘా షాహిద్ అలీ ముస్లిం, హిందూ, పాశ్చాత్య మూడు సంస్కృతుల సమ్మేళనంగా కనిపిస్తాడు. దిల్లీలో పుట్టిన ఆయన చాలా కాలం శ్రీనగర్ లో పెరిగాడు. తర్వాత కొంతకాలం ఇండియానాలో వున్నాడు. అక్కడే హై స్కూల్ చదువు పూర్తి చేసుకున్నాడు. కాశ్మీర్, ఢిల్లీ విశ్వద్యాలయాల్లో చదువు తర్వాత షహీద్ పెన్సిల్వేనియా విశ్వద్యాలయంలో పీ.హెచ్.డీ. పూర్తి చేసాడు. అంతేకాదు ఆరిజోన విశ్వ విద్యాలయం నుండి ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్ డిగ్రీ కూడా చేసాడు. అందుకే ఆయన సృజనాత్మక రంగం విస్తారమయింది. వివిధ దేశాల సాహిత్యంతో పాటు బాలీవుడ్,హాలీవుడ్, సమాంతర ఆర్ట్ సినిమా ఇట్లా అనేక కోణాల్లో ఆయన కృషి చేసాడు. దాంతో పాటు సంగీతంలో కూడా షాహిద్ కృషి కొనసాగింది. షాహీద్ పైన బేగం అఖ్తర్ ప్రభావం అధికంగా వుంది. ఫలితంగా గజల్స్ పైన అధిక మమకారం పెంచుకున్నాడు. షాహీద్ అనేక అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా పనిచేసాడు.

ఆయన జీవితంలో కాశ్మీర్ విషాదంతో పాటు స్వంత తల్లి అనారోగ్యం ఎంతో ప్రభావం చూపింది. ఆఘా షహీద్ తల్లి బ్రెయిన్ కాన్సర్ తో బాధపడి మరణించారు. అమ్మ లేని ఆ లోటు నుంచి కొల్కోవడం అంత సులభం కాలేదు. విషాదం  ఏమిటంటే ఆఘా షాహీద్ అలీ కూడా 2001 లో అదే బ్రెయిన్ కాన్సర్ తో  మరణించాడు.    

‘ద వేయిల్ద్ సూట్’ ( కలెక్టేడ్ పోయెమ్స్) లో షాహీద్ రాసిన ద హాఫ్ ఇంచ్ హిమాలయాస్, ఎ వాక్ త్రూ ది ఎల్లో పేజెస్, ఎ నాస్టాల్జిక్ మాప్ ఆఫ్ అమెరికా, ద కంట్రీ వితౌట్ పోస్ట్ ఆఫీస్, రూమ్స్ ఆర్ నెవర్ ఫినిష్డ్, కాల్ మి ఇష్మాయిల్ తో నైట్ కవితా సంకలనాల్లోంచి తీసుకున్న కవితలున్నాయి. ఇంకా షాహీద్ అనేక కవితా సంకలనాలు వెలువరించారు. తను మంచి అనువాదకుడు కూడా. ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్ని ‘ద రెబెల్స్ సిల్హౌట్ : సెలెక్టేడ్’ పేర ఇంగ్లీష్ లోకి చేసాడు.  

షాహీద్ అలికి ‘పుష్కార్ట్ ప్రైజ్’ , న్యూ యార్క్ ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ వారి ఫెలో షిప్ తదితర పురస్కారాలు లభించాయి.

ఆయన కవితల్లోంచి కొన్ని చిన్న కవితల అనువాదాలు..   

నేను ప్రేమించాను

నేను అమితంగా ప్రేమించిన చోటికి 
స్వల్పకాలమయినా తిరిగి వెళ్ళాలి
నేను ప్రేమించిన 
ఎంత మందిని 
నువ్వు తుడిచిపెట్టేశావో 
నీకు చెప్పడానికి .
                  *
ఉనికి

నువ్వు వెళ్లిపోతే 
నా దుఃఖపు ఉనికిని 
ఎవరు నిరూపిస్తారు
ఉనికిలోకి రాకముందు 
నేనెవర్నో చెప్పవూ. . . . 
                 *
దహనం 

మేము శరీరాన్ని 
తగులపెట్టినప్పుడు 
నీ ఎముకలు 
కాలి బూడిద కావడానికి అంగీకరించలేదు
ఎవరూహించారు 
మరణంలోనూ 
నువ్వు 
మొండి పట్టుదల గలవాడివని.
                   *
పిలుపు 

కళ్ళు మూసుకుంటాను 
ఇంట్లోకి చొచ్చుకొచ్చి 
అమ్మా నాన్నల ప్రేమను దోచుకొనే 
చల్లటి కాశ్మీర్ చందమామ 
నన్ను వదిలిపెట్టదు
నేను చేతులు తెరుస్తాను 
అంతా ఖాళీ ఖాళీ 
ఇది విదేశీ దుఃఖం
'ఇంటికి ఎప్పుడు వస్తున్నావు'
నాన్న అడుగుతాడు 
మళ్ళీ మళ్ళీ అడుగుతాడు
మహాసముద్రం ఒక్కసారిగా రక్త నాళాల్లో 
పరుగులు పెడుతుంది
'అంతా బాగున్నారా'
నేను బిగ్గరగా అడుగుతాను
మాటలు నిర్జీవమయిపోతాయి 
రక్త నాళాల్లో నీరింకిపోతుంది
సముద్రం నిశ్శబ్దమవుతుంది 
దానిపై చల్లని పూర్ణ చంద్రుడు పరుచుకుంటాడు 

ఆంగ్లమూలం: ఆఘా షహీద్ అలీ 
(ప్రసిద్ద కాశ్మీరీ-అమెరికన్ కవి)
తెలుగు: వారాల ఆనంద్

 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios