విటమిన్ డి లోపం ఎన్ని అనారోగ్య సమస్యలను కలిగిస్తుందో మనందరికీ తెలుసు.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ విటమిన్ డి లోపం సెక్స్ లైఫ్ పై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ లోపం వల్ల సెక్స్ పై కోరికలు తగ్గడంతో పాటుగా ఆ సమస్యలు కూడా వస్తాయంటున్నారు నిపుణులు.
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి వ్యక్తికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్లు పుష్కలంగా ఉంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాము. అయితే మన దేశంలో విటమిన్ డి కొరత ఉండకపోయినా.. చాలా మంది ఈ పోషక లోపంతో బాధపడుతున్నారని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. విటమిన్ డి లోపంతో ఎముకలు బలహీనపడతాయి. పగుళ్లు కూడా వస్తాయి. దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టు రాలుతుంది. అలసట ఎక్కువవుతుంది. ఇవన్నీ చాలా మందికి తెలుసు.. కానీ ఇది లైంగిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. మహిళల్లో లైంగిక వాంఛ నుంచి పురుషులలో టెస్టోస్టెరాన్ తగ్గించడం వరకు.. విటమిన్ డి లోపం దంపతుల లైంగిక జీవితాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది.
సూర్యరశ్మి విటమిన్ డి కి ఉత్తమ వనరులలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే పుట్టగొడుగులు, గుడ్డులోని పచ్చసొన, కొవ్వు చేపలు వంటి కొన్ని ఆహారాల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కొన్ని ఆహారాలు , పోషకాలు లైంగిక కోరికలను పెంచినట్టే కొన్ని పోషకాల లోపం కూడా సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పోషకాల్లో విటమిన్ డి కూడా ఉంది. విటమిన్ డి శోషణ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇది మన శరీరంలో కాల్షియం, ఫాస్ఫేట్ స్థాయిలను నియంత్రిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల సెక్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
లైంగిక కోరికలు ప్రభావితం అవుతాయి
2016 లో ప్రచురించబడిన యూరోపియన్ జర్నల్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ గైనకాలజీ అండ్ రిప్రొడక్టివ్ బయాలజీ అధ్యయనం ప్రకారం.. ఇది నిరాశ లక్షణాలను ప్రేరేపిస్తుంది. అంతేకాదు ఇది ఆడవారిలో లైంగిక కోరికలను తగ్గిస్తుందని సూచిస్తుంది. ఈ అధ్యయనంలో భావప్రాప్తి చాలా తక్కువగా ఉంటుందని వెల్లడైంది.
లైంగిక సంతృప్తి లోపానికి దారితీస్తుంది
ఈ అధ్యయనంలో విటమిన్ డి లోపం ఉన్న 14 మంది మహిళలు, విటమిన్ డి లోపం ఉన్న 14 మంది మహిళలు పాల్గొన్నారు. అలాగే విటమిన్ డి లోపం లేని ఆరోగ్యకరమైన మహిళలు, పురుషులు కూడా పాల్గొన్నారు. అయితే విటమిన్ డి లోపం ఉన్న మహిళలే తక్కువ స్థాయిలో లైంగిక సంతృప్తిని పొందారని అధ్యయనంలో తేలింది.
పురుషులలో లైంగిక కోరికలను ప్రభావితం చేస్తుంది
విటమిన్ డి లోపం మహిళల్లోనే కాదు.. పురుషుల్లో కూడా లైంగిక పనితీరుపై ప్రభావం చూపుతుంది. ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంపోటెన్స్ పరిశోధన.. ఆరోగ్యకరమైన పురుషులలో లైంగిక పనితీరును, విటమిన్ డి లోపం ఉన్న పురుషులలో లైంగిక పనితీరును పరిశీలించింది. ఈ అధ్యయన ఫలితాల ప్రకారం.. తక్కువ విటమిన్ డి స్థాయిలు అంగస్తంభన లోపానికి, తక్కువ భావప్రాప్తి , లైంగిక కోరికలు తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
పురుషులలో అంగస్తంభన లోపానికి కారణమవుతుంది
మరొక పరిశోధన వరల్డ్ జర్నల్ ఆఫ్ మెన్స్ హెల్త్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. విటమిన్ డి లోపం అంగస్తంభనకు కారణమవుతుంది. పురుషాంగం శరీర నిర్మాణ అభివృద్ధికి ఈ విటమిన్ అవసరమని ఇది పేర్కొంది.
తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు
ఒక పరిశోధన ప్రకారం.. విటమిన్ డి, టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి మధ్య సంబంధం ఉంటుంది. మంచి సెక్స్ డ్రైవ్ కోసం ఈ సెక్స్ హార్మోన్ చాలా చాలా అవసరం. వివిధ అధ్యయనాల ప్రకారం.. తక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తక్కువ శక్తి, తక్కువ కండర ద్రవ్యరాశి, లైంగిక కోరికలు లేకపోవడం, బోలు ఎముకల వ్యాధికి దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంది.