Asianet News TeluguAsianet News Telugu

Bathukamma 2023: తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ.. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత.. అదేంటో తెలుసా?

Bathukamma 2023:  బతుకమ్మ పండుగ మన సాంస్కృతిక అస్తిత్వంలో అంతర్భాగమైపోయింది. ఈ పండుగను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగకున్న మరో ప్రత్యేకత ఏంటంటే..? ఈ ప్రాంతంలో మాత్రమే పండే పూలతోనే బతుకమ్మను తయారుచేస్తారు. ప్రతి ఏడాది ఈ పండుగను వర్షాకాలం చివర, శీతాకాలం ప్రారంభానికి ముందు జరుపుకుంటారు. వర్షాకాల వానల వల్ల చేరువులు, కుంటలు, బావులు నిండుకుండలా మారుతాయి. దీంతో ఈ ప్రాంతమంతా రకరకాల పువ్వులు పూస్తాయి. 

Bathukamma 2023: bathukamma celebrated nine days nine different names rsl
Author
First Published Oct 10, 2023, 1:04 PM IST

Bathukamma 2023: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. శరదృతువు  అని కూడా పిలువబడే శరత్ సీజన్ ప్రారంభానికి  ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంటే ఈ పండుగను మనం నవరాత్రులతో పాటుగా జరుపుకుంటామన్న మాట. బతుకమ్మ పండుగను సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలోనే జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండును అక్టోబర్ నెలలో జరుపుకోబోతున్నాం. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగను ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి  జరుపుకోబోతున్నాం. ఈ పండు అక్టోబర్ 23 ముగుస్తుంది. బతుకమ్మ పండుగను తెలంగాణాలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పండుగ. అందుకే బతుకమ్మ మొదటి రోజు ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటిస్తుంది కూడా. 

ఇకపోతే బతుకమ్మను తయారుచేయడానికి తీరొక్క పువ్వులను ఉపయోగిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గునుకు పూలు, తంగేడు పూలు, బంతి పూలు అంటూ తీరొక్క పువ్వుతో  బతుకమ్మను అందంగా తయారుచేస్తారు ఆడపడుచులు. అంతేకాదు ఈ బతుకుమ్మను ఎలా పడితే అలా పేర్చరు. ఆలయం గోపురాకారంలోనే బతుకమ్మను పేరుస్తారు. 

ఈ పండుగ ఆడవాళ్లకు ఎంతో ప్రత్యేకమైంది. తమ కుటుంబం, వైవాహిక జీవితం ఆనందంగా ఉండానికి పార్వతీ దేవి ఆశీస్సులు పొందడానికి ఈ రోజున గౌరీ మాతకు పూజలు చేస్తారు. బతుకమ్మ పండుగకున్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ రోజున ఆడవాళ్లు ఎంతో మధురమైన పాటలు పాడుతారు. తమ జీవితానికి సంబంధిన విషయాలనే బతుకమ్మ పాటగా పాడటం విశేషం. తొమ్మిది రోజుల పాటే సాగే ఈ పండుగలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతిరోజూ గౌరమ్మకు వేర్వేరు నైవేద్యాలను సమర్పిస్తారు.  ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మొదటి రోజు: ఎంగిలి పువ్వుల బతుకమ్మ

బతుకమ్మ మొదటి రోజును ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటారు. ఈ రోజు తమ పూర్వీకులకు అన్నదానం చేసి నివాళులు అర్పిస్తారు. అందుకే దీన్ని పెత్రామస అని కూడా అంటారు. ఈ రోజు బియ్యం, నువ్వులతో నైవేద్యం చేసి సమర్పిస్తారు.

రెండో రోజు: అటుకుల బతుకమ్మ

బతుకమ్మ రెండో రోజును అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. దీనిని ఆశ్వయుజ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. అటుకులు, సప్పిడి పప్పు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

మూడో రోజు: ముద్దపువ్వు బతుకమ్మ

బతుకమ్మ మూడో రోజున ముద్దపువ్వు బతుకమ్మను జరుపుకుంటారు. ముద్దపువ్వు బతుకమ్మను నాలుగు రకాల పువ్వులతో తయారుచేస్తారు. అవేంటంటే.. ముద్ద చామంతి, ముద్ద బంతి పువ్వులు, గునుగ పువ్వు, తంగేడు పువ్వు.  ఈ రోజు మద్దపప్పు, అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 

నాలుగో రోజు: నానెబియ్యం బతుకమ్మ

నాలుగో రోజు నానెబియ్య బతుకమ్మను జరుపుకుంటారు. దీనిని ఆశ్వయుజ తృతీయ నాడు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున నానీనా బియ్యం, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

ఐదో రోజు: అట్ల బతుకమ్మ

ఐదో రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజున ఆడవాళ్లు అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరో రోజు: అలిగిన బతుకమ్మ

ఆశ్వయుజ పంచమి నాడు అలిగిన బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని తయారుచేయరు. కాగా ఈ రోజును లలితా పంచమి అని కూడా అంటారు. ఈ రోజున దుర్గాదేవికి బాధ కలిగిందని నమ్ముతారు.

ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ

ఆశ్వయుజ షష్టి నాడు వేపకాయల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజున సకినాల పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది వేపకాయ ఆకారంలో ఉంటుంది.

ఎనిమిదో రోజు: వెన్న ముద్దుల బతుకమ్మ

ఎనిమిదో రోజు వెన్న ముద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజు వెన్నతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. మజ్జిగ, నెయ్యి, బెల్లం, నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు.

తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మను ఆశ్వయుజ అష్టమి నాడు జరుపుకుంటారు. ఈ రోజు పెరుగు అన్నం, నువ్వుల అన్నం, చింతపండు అన్నం, కొబ్బరి అన్నం, లెమన్ రైస్ ఇలా ఐదు రకాల అన్నాన్ని, ఒక స్వీట్  ను  నైవేద్యంగా సమర్పిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios