కరీంనగర్:  కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. క్షణాకావేశంలో భవిష్యత్ గురించి ఆలోచించకుండా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు అగ్గికి  ఆహుతయ్యాడు. 

ఈ విషాదానికి  సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మానకొండూర్ మండలం దేవంపల్లి గ్రామానికి తుమ్మ సంపత్ (32) తాగుడుకు బానిసయ్యాడు. ఎలాంటి  ఉద్యోగం చేయకపోవడమే కాకుండా కుటుంబసభ్యులతో మద్యం కోసం నిత్యం గొడపడేవాడు. ఇలా అతడి ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో కుటుంబసభ్యులంతా కలిసి అతడి మందలించారు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోంచి పొగలురావడం  గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికి పూర్తిగా కాలిపోయిన స్థితిలో సంపత్ విగతజీవిగా పడివున్నాడు. 

కుటుంబసభ్యులు అందించిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిరుద్యోగంతో తాగుడుకు బానిసవడం... కుటుంబ కలహాల కారణంగానే సంపత్ ఆత్మహత్య చేసుకుని వుంటాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.