బ్యాంక్ ఉద్యోగం రాలేదన్న మనస్థాపం... కరీంనగర్ లో యువతి ఆత్మహత్య
బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రయత్నించి అలసిపోయిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది.
కరీంనగర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాంనగర్ కాలనీలో అద్దెకుంటూ బ్యాంక్ ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న దుర్శెట్టి సుష్మ(26 సంవత్సరాలు) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడంలేదన్న మనస్థాపంతోనే యువతి బలవన్మరణానికి పాల్పడి వుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన దుర్శెట్టి చంద్రకళ(48 సంవత్సరాలు) కూతురు సుష్మతో కలిసి కరీంనగర్ లో నివాసముంటోంది. భర్త రమేష్ చనిపోవడంతో తల్లికూతుల్లిద్దరే నివాసముంటున్నారు.
అయితే 2015లో ఎంబీఏ పూర్తిచేసిన సుష్మ అప్పటినుండి బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోంది. 2016 లో నంద్యాలలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకోని అప్పటినుండి ఎంట్రన్స్ పరీక్షలు రాస్తోంది. అయితే ఎంత ప్రయత్నించినా ఆమె బ్యాంక్ ఉద్యోగాన్ని సాధించలేక పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది.
గురువారం ఉదయం ఇంట్లో తల్లిలేని సమయంలో తన బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి దీన్ని గమనించి వెంటనే చుట్టుపక్కల వారి సాయంతో కూతురిని హాస్పిటల్ కు తరలించింది. అయితే అప్పటికే యువతి మరణించినట్లు డాక్టర్లు నిర్దారించారు. కూతురి మృతదేహం ఏడుస్తున్న ఆ తల్లిని ఆపడం ఎవరితరం కావడంలేదు. భర్తను కోల్పోయినా కూతురికోసమే బ్రతుకుతున్న ఆ తల్లి ఇప్పుడు ఒంటరిగా మారింది.