ఆన్లైన్ జూదంలో నిండా మునిగి...కరీంనగర్ యువకుడి ఆత్మహత్య
ఆన్లైన్ జూదానికి అలవాడుపడి భారీగా డబ్బులు కోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.
కరీంనగర్: ఆన్లైన్ బెట్టింగ్, జూదానికి అలవాటిపడి యువత పెడదారి పట్టడమే కాదు ఆర్థికంగానూ నష్టపోతున్నారు. ఇలా ఆన్లైన్ జూదానికి అలవాడుపడి భారీగా డబ్బులు కోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్ గ్రామానికి చెందిన నరేష్( 22) ఆన్లైన్ బెట్టింగ్(జూదం) కు అలవాటుపడ్డాడు. నిత్యం ఇందులోనే మునిగితేలుతూ భారీగా డబ్బును అందులో తగలేశాడు. ఇలా అప్పులు తెచ్చి మరీ ఆడేంతగా ఆ జూదానికి అలవాటుపడ్డాడు. ఇలా తన వద్ద వున్న డబ్బులను కోల్పోవడమే కాదు అప్పుతెచ్చిన డబ్బులను పోగొట్టుకున్నాడు.
read more భార్య, బిడ్డలను వదిలేసి మరో మహిళతో సహజీవనం.. చివరకు..
దీంతో అతడికి ఇబ్బందులు మొదలయ్యాయి. చేతిలో డబ్బులు లేక అప్పులు కట్టలేక తీవ్ర మనస్థాపానికి గురయిన నరేష్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ కష్టాల నుండి బయటపడాలంటూ చావు ఒక్కటే శరణ్యమని భావించిన అతడు తిమ్మాపూర్ మండలం అల్గునూరు శివారులోని కాకతీయ కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో యువకుడి మృతదేహాన్ని కాలువలోంచి బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.