కరీంనగర్: కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను ప్రాణాలకు తెగించి మరీ స్థానిక యువకులు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను పోలీస్ వాహనంలోనే తరలించి ప్రాణాలు చికిత్స అందించారు. ఇలా పోలీసులు, స్థానికులు మానవత్వం చాటుకోవడంతో ఒక మహిళ నిండు ప్రాణం దక్కింది.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం కరీంనగర్ పట్టణానికి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకోవాలనే ఉదేశ్యంతో కాకతీయ కెనాల్ లో దూకింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న మహిళను అటుగా వెళ్తున్న స్థానికులు సుందరగిరి సతీష్, దుండ్ర ఎల్లయ్య అనే యువకులు గమనించారు. దీంతో ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలో దూకి ప్రాణాలకు తెగించిమరీ యువతిని కాపాడారు. 

read more   అర్థరాత్రి ప్రయాణం.. ట్రాక్టర్ ఢీకొట్టడంతో...

మహిళను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించగా వెంటనే స్పందించిన ఎస్ఐ కృష్ణారెడ్డి, బ్లుకోల్ట్స్ హోంగార్డ్ లక్ష్మీనారాయణలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న మహిళను పోలీస్ వాహనంలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. స్వయంగా ఎస్ఐ కృష్ణారెడ్డి వాహనం నడుపుకుంటూ వెళ్లి కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. 

ఎలాగైనా యువతి ప్రాణాలు కాపాడాలని ఆలోచనతో సొంతంగా వాహనాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఎస్సై ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు అభినందించారు . ఆ మహిళను కాపాడిన స్థానికులైన సుందరగిరి సతీష్, దుండ్ర ఎల్లయ్య లను ఎస్ఐ కృష్ణారెడ్డితో పాటు ప్రజలు అభినందించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో  యువతి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి విచారణ తర్వాత ఆ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.