కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి సదానంద గౌడ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. రామగుండం ఎరువుల కర్మాగారం వద్ద కేంద్రమంత్రి సదానంద గౌడ పర్యటిస్తున్నారు. సదానంద గౌడ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ ఆందోళనకు దిగారు. 

సదానంద గౌడ పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గాల్లో ఎలా పర్యటిస్తారంటూ మండిపడ్డారు. కేంద్రమంత్రి తీరును తప్పుబడుతూ ఆందోళనకు దిగారు.  

టీఆర్ఎస్ ఆందోళనకు పోటీగా బీజేపీ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. ఒకానొక దశలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్రమంత్రి సదానంద గౌడ దిగొచ్చారు. 

నేరుగా టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చంద్రశేఖర్ ల వద్దకు వెళ్లారు. ఆందోళన విరమించాలని కోరారు. కేంద్రమంత్రి వచ్చి విరమించాలని అడగడంతో ఎంపీ ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. దాంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.