కరీంనగర్: ఆటవిక ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నదీ పరీవాహక ప్రాంతాలలో తిరుగుతూ పులుల్సి వేటాడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం పరిధిలో పులి చర్మాన్ని విక్రయిస్తుండటగా ఈ ముఠాను రామగుండం కమీషనరేట్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరి నుంచి చిరుత పులి చర్మాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి పరివాహాక ప్రాణహిత నది పరివాహాక ప్రాంతంలో గత కొంత కాలంగా చిరుత సంచరిస్తున్న స్థానికుల సమాచారం మేరకు కొందరు దొంగల ముఠా పులిని వేటాడేందుకు పన్నాగం పన్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి తాలుకా మరుపల్లి గ్రామానికి చెందిన తిరుపతి, గంగారాం, తులసిరాం ముగ్గురు కలిసి పులిని వేటాడేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. 

నదీ పరివాహక ప్రాంత అడవుల్లో చిరుత సంచారాన్ని గుర్తించిన ముగ్గురు దుండగులు దానిని చంపి చర్మాన్ని ఒలిచారు. ఈ చర్మాన్నే విక్రయించేందుకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రం సమీపంలో తచ్చాడుతుండగా రామగుండం పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

గత నాలుగు నెలల క్రితం చెన్నూరు సమీపంలో బెంగాల్ టైగర్ ను చంపి చర్మాన్ని విక్రయిస్తున్న మాదిరిగానే చిరుత చర్మాన్ని విక్రయించేందుకు దుండగులు ప్రయత్నాలు చేసినట్లు రామగుండం సిపి సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట్ర నుంచి తరుచుగా పులి చర్మాల విక్రయాల కోసం ముఠాలు వస్తున్నాయని తమ కున్న పటిష్ట వ్యవస్థ కారణంగా నిందితులను అరెస్ట్ చేయగలుగుతున్నామని ఆయన తెలిపారు. 

తాజాగా పట్టుబడిన నిందితుల వివరాలు మహారాష్ట్ర పోలీసులతో పాటు అటవీ అధికారులకు తెలియ చేసినట్లు పేర్కొన్నారు. పులి చర్మం అమ్మడమే కాదు కొనడం కూడా నేరమేనని... అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సిపి తెలిపారు.