సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీస్ విధులతో పాటు సామజిక సేవలోనూ ముందుంటారు. జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా తానే స్వయంగా వెళ్లి స్పందిస్తారు. జిల్లాలోనే తన పోలీస్ సిబ్బందిని కూడా అలాగే ప్రేరేపిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ పద్మ దంపతులు అనారోగ్యంతో మృతి చెందగా వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. 

ఆ చిన్నారుల బంధువులు కూడా ఎవరు కూడా వారి మీద భారం పడుతుందో ఏమో ఆ పిల్లలను దగ్గరకు రానివ్వలేదు. మండల కేంద్రానికి సమీపంలో ఆ పిల్లల అమ్మమ్మ ఉండటంతో ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు. కానీ ఇటీవల ఆ వృద్ధురాలికి కూడా అనారోగ్యంగా ఉండటంతో దీంతో ఆ పిల్లలిద్దరి పరిస్థితి దయనీయంగా మారింది.

ఈ విషయం తన సిబ్బంది ద్వారా తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వారికి ముందుగా ఒక సొంత గృహం ఉండాలన్న తలంపుతో ఒక స్థలం సేకరించి పోలీసుల ఆధ్వర్యంలో ఒక గృహాన్ని ఆ చిన్నారులకు నిర్మించి రెండు రోజుల క్రితం గృహప్రవేశం చేసారు.

అంతేకాదు ఆ చిన్నారుల ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయల చెక్ ని ఇచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. నెటిజన్లు పోలీసుల్లో కూడా ఇలాంటి పోలీసులు ఉంటారని కామెంట్లు పెడుతున్నారు.  ఈ విషయం తెలిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎస్పీ రాహుల్ హెగ్డే చేసిన సహాయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.