జగిత్యాల: ఎంసెట్ ఫలితాల్లో క్వాలిఫై కాలేకపోయానన్న మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

జగిత్యాల రూరల్ మండలం హస్నాబాద్ కు చెందిన చింతనూరి వెంకటేష్(19) అనే యువకుడిది ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తయ్యింది. దీంతో అతడు పైచదువుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశపరీక్ష ఎంసెట్ రాశాడు. అయితే ఈ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో కనీస అర్హత మార్కులు సాధించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన వెంకటేష్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

తమ గ్రామ సమీపంలో చల్ గల్ గ్రామానికి చేరుకున్న అతడు శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బావిలో అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్ధలానికి సిబ్బందితో కలిసి చేరుకున్న స్థానిక ఎస్సై చిర్ర సతీష్ కుమార్  విద్యార్థి మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీయించారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.