కరీంనగర్: నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని వృద్దాప్యంలో కంటికిరెప్పలా చేసుకోవాల్సిన కొడుకే కసాయివాడిలా  ప్రవర్తించాడు. తల్లి అనే కాదు కనీసం పెద్దమనిషి అన్న జాలికూడా లేకుండా కొడుకుతో పాటు కోడలు కూడా చితకబాదారు. అయితే ఇలా వృద్దురాలిని హింసించిన భార్యాభర్తలకు తగిన శాస్తి జరిగింది. వారిద్దరికి  జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ రూరల్ పరిధిలోని మందులపల్లి గ్రామానికి చెందిన మేకల చిన్నక్క(85)కు నలుగురు కుమారులు.  వృద్దురాలు కావడంతో ఆమె పేరు మీద బ్యాంక్ లో రూ.1.40 లక్షలు జమ చేసిన ముగ్గురు కొడుకులు బాధ్యతలను చూసుకోవడానికి చిన్న కుమారుడు అనిల్ కు అప్పగించారు. 

అయితే అనిల్ మాత్రం తల్లి కోసం సోదరులు బ్యాంక్ లో వేసిన డబ్బులు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడమే కాదు తల్లిని సరిగా చూసుకోవడం లేదు. అతడితో పాటు భార్య రవళి కూడా వృద్దురాలిని చిత్రహింసలకు గురిచేసేవారు. ఇలా గత ఫిబ్రవరి 5వ తేదీన అకారణంగా అనిల్, రవళిలు కలిసి చిన్నక్కను కొట్టడమే కాకుండా పరుష పదజాలంతో దూషించారు. 

దీంతో తీవ్ర  మనస్థాపానికి గురయిన ఆమె స్థానికుల సాయంలో కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. తనపై కొడుకు, కోడలు దాడి చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనిల్,రవళిలు నేరం అంగీకరించడంతో ఇద్దరికి 10 రోజుల జైలుశిక్షతో పాటు రూ.1200 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 

కన్న తల్లిని చితకబాదినందుకు ఈ దంపతులకు శిక్ష విధించడంపై కరీంనగర్ జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. వారికి తగిన శాస్తి జరిగిందని... తల్లిదండ్రులను హింసించేవారికి ఈ తీర్పు గుణపాఠంగా వుటుందంటున్నారు.