కొందరు యువకులు రాడ్లు కత్తులు పట్టుకొని డిసెంబర్ 31 న అర్ధరాత్రి  ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన సంఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. రోడ్డుపై ఉన్న మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ బీరు బాటిళ్లు నడిరోడ్డుపై పగలగొడుతూ వీరు ఒక గంట సేపు పట్టణంలో హల్ చల్ సృష్టించారు. మంగళవారం రాత్రి పట్టణమంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా ఆ యువకులు మద్యం మత్తులో ఈ అకృత్యాలకు పాల్పడ్డారు. 

రాడ్లు పట్టుకొని ఏకంగా ఒక ఇంటిపైనే దాడికి ప్రయత్నించారు. వెంటనే ఎవరో కొందరు వ్యక్తులు 100 కి ఫోన్ చేయగా స్థానిక పోలీసులు రంగంలోకి దిగి వారు వెళ్తున్న దారిలో అటకాయించి ఆ పోకిరీల భరతం పట్టారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు పోలీసుల పైన ఎదురు దాడికి దిగటానికి యత్నించగా పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఆ యువకులు చాలా ఆకతాయిగా ప్రవర్తిస్తుంటారని అక్కడి స్థానిక ప్రజలు చెప్తున్నారు. పట్టణంలో జులాయిగా తిరుగుతూ వారికి ఎదురొచ్చినవారిపై దాడికి తెగబడుతారని ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య హైదరాబాద్ లాంటి మహానగర సమీపంలో దిశ లాంటి అత్యాచారసంఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ నేరం చేసిన నిందితులు కూడా ఇలాంటి పోకిరి యువకులే కావటంతో పోలీసులు గ్రామాల్లో ఉన్న ఇలాంటి పోకిరీలపై దృష్టి పెట్టి వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.