సిరిసిల్ల సిఐ బాగోతంపై ఏషియా నెట్ న్యూస్ కథనం: స్పందించిన ఎస్పీ
సిరిసిల్ల సిఐ శ్రీనివాస చౌదరిపై ఏషియా నెట్ న్యూస్ తెలుగు ప్రచురించిన వార్తాకథనంపై రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే స్పందించారు. సిఐపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కరీంనగర్: సిరిసిల్ల సిఐ అక్రమ లీలల బాగోతం పేరుతో ఏషియా నెట్ న్యూస్ ప్రచురించిన వార్తాకథనంపై రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే స్పందించారు. సిరిసిల్ల సిఐ శ్రీనివాస చౌదరిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సిరిసిల్ల సిఐ శ్రీనివాస చౌదరిపై ఏషియానెట్ న్యూస్ వార్తాకథనం ప్రచురించిన విషయం తెలిసిందే.
తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో జరిగిన నేరెళ్ల ఇసుక అక్రమ రవాణ సంఘటన కేటీఆర్ ను రాజకీయంగా చాల ఇబ్బందులకు గురిచేసింది. ఆ సంఘటన రాష్ట్రాన్నే ఒక కుదుపు కుదిపింది. అప్పుడు ఆ సంఘటనలో సాక్ష్యాత్తు జిల్లా ఎస్పీనే బదిలీ చేసి, లోకల్ అధికారులను సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఇప్పుడు కొత్తగా నియోజకవర్గంలో ఇసుక సెటిల్ మెంట్లు, భూ దందాల విషయంలో మళ్ళి కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సిరిసిల్ల పట్టణ సిఐ శ్రీనివాస్ చౌదరి... నేను మంత్రి కేటీఆర్ కి దగ్గరని చెప్పుకునే స్థానిక నేత సహకారంతో భూ దందాలు, ఇసుక సెటిల్ మెంట్లు చేస్తూ అక్రమ వసూళ్ల దందాని మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లేలా చేస్తున్నాడని వినికిడి. ఇప్పటికే ఈ సిరిసిల్ల పట్టణ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పటికే భూ దందాల పేరుతో పలువురిని బెదిరించటం, ఎవరైనా ఎదురు తిరిగితే రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకురావటం ఈ ఖాకికి అలవాటని... వైన్స్ షాపుల యజమానులు బెదిరించి డబ్బులు వసూలు చేయటం.. ఎదురుతిరిగిన వారిని వేధించటం ఇలాంటి ఎన్నో ఆరోపణలు ఇతనిపై సిరిసిల్ల పట్టణంలో కోకొల్లలు ఉన్నాయి.
ఇసుక అక్రమ రవాణా విషయంలో ఎన్నో ముడుపులు అందుకొని అక్రమ రవాణని యధేచ్చగా ప్రోత్సహించాడని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా కేటీఆర్ నియోజకవర్గంలోనే ఇంత దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్న సిఐకి స్థానిక అధికార పార్టీ నేతల అండ ఉండటం కొసమెరుపు.
సిరిసిల్ల సిఐ అక్రమ లీలల బాగోతం??